బాధితులందరికీ న్యాయం చేస్తాం

We Will Do Justice To All Victims - Sakshi

బాండులున్న వారి చేతికి  20 రోజుల్లో డబ్బు

తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మరళీమోహన్‌

మొయినాబాద్‌రూరల్‌ (చేవెళ్ల): అజీజ్‌నగర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకున్న డబ్బును బాధితులందరికీ 20 రోజుల్లో అందజేసేందుకు కృషి చేస్తానని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మురళీమోహన్‌ హామీ ఇచ్చారు. బ్యాంకులో దాచుకున్న డబ్బును ఇవ్వకుండా తిప్పుకుంటున్న అధికారులకు బాధలు తెలియజేసేలా చేపట్టిన బాధితుల ధర్నా మూడు రోజుల పాటు కొనసాగింది.

బుధవారం మూడవరోజు బాధితులు అజీజ్‌నగర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మరళీమోహన్‌ అజీజ్‌నగర్‌ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాండులున్న వారందరికీ డబ్బులు తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఎవరికీ అన్యాయం చేయకుండా 20 రోజుల్లో డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులు, గ్రామస్తులు బ్యాంకు సేవలను యథావిధిగా కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో బాధితులు ధర్నాను విరమించుకున్నారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి కేవీఎస్‌ రాజు, బ్యాంకు మేనేజర్‌ రాంమోహన్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జంగయ్య, మండల కార్యదర్శి రత్నం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, అజీజ్‌నగర్‌ వార్డు మెంబర్‌ నర్సింగ్, బాధితులు మాడి శ్రీనివాస్‌రెడ్డి, మాల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, తూర్పు చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top