తుంగభద్ర.. దొంగ దెబ్బ! | Water problems of Tunga bhadra Project | Sakshi
Sakshi News home page

తుంగభద్ర.. దొంగ దెబ్బ!

Aug 16 2017 1:42 AM | Updated on Sep 17 2017 5:33 PM

తుంగభద్ర.. దొంగ దెబ్బ!

తుంగభద్ర.. దొంగ దెబ్బ!

ఎగువన ఉన్నామన్న తెంపరితనం.. దిగువకు తెలియదులేనన్న విచ్చలవిడి తనంతో కర్ణాటక రాష్ట్రం

► ఓ వైపు వాడుకుంటూనే.. మరోవైపు తప్పుడు లెక్కలు
► తుంగభద్ర ఎగువన భారీగా నీటి వినియోగం.. ప్రాజెక్టును మాత్రం ఖాళీగా ఉంచుతున్న వైనం
► ఆర్డీఎస్‌ కాల్వలు ఆధునీకరించకుండా 15 టీఎంసీలు హాంఫట్‌..
►  రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం  


70  టీఎంసీలు ఏటా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి రావాల్సిన నీరు
♦  కానీ మూడు నాలుగేళ్లుగా చుక్క నీరు కూడా రాని పరిస్థితి


తుంగభద్రలో సరాసరి నిల్వల తీరు..
ఏడాది        టీఎంసీలు

2015–16      73
2016–17      43
2017–18      41

ఎగువన ఉన్నామన్న తెంపరితనం.. దిగువకు తెలియదులేనన్న విచ్చలవిడి తనంతో కర్ణాటక రాష్ట్రం నదీ జలాల దోపిడీకి పాల్పడుతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను అడ్డగోలుగా వినియోగించుకుంటూనే.. తుంగభద్ర నుంచి చుక్కనీరు కూడా దిగువకు రాకుండా వాడేసుకుంటోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువనే నీటినంతా వినియోగించుకుంటూ.. ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ.. నీటి లభ్యతను దాచేయత్నం చేస్తోంది.

మూడేళ్లుగా దుస్థితి..
జూన్, జూలై నెలల్లో కురిసే సాధారణ వర్షాలకే తుంగభద్ర నుంచి దిగువకు ప్రవాహాలు మొదలై.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సాగర్‌ ప్రాజెక్టుల్లోకి చేరాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాన కృష్ణాలో వరద లేక ఆల్మట్టి నుంచి సాగర్‌ వరకు ప్రాజెక్టుల్లో నీళ్లు లేకున్నా తుంగభద్ర ఆదుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి సమస్య తీరింది. తుంగభద్రలో నీటి నిల్వలను గత పదేళ్ల సరాసరి తీసుకొంటే 93 టీఎంసీలు నిల్వ ఉంది. సరాసరిన 17,240 క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ మూడు నాలుగేళ్లుగా పరిస్థితి మారిపోయింది. 2015–16లో తక్కువగా 73 టీఎంసీలు, 2016–17లో 43 టీఎంసీలు, 2017–18లో  41 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది 8 రోజుల పాటు 7వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వచ్చి.. తర్వాత నిలిచిపోయాయి.

అప్పర్‌లోనే పూర్తి వినియోగం
100 టీఎంసీల సామర్థ్యమున్న తుంగభద్ర ప్రాజెక్టు ఎగువనే కర్ణాటక గరిష్టంగా నీటిని వినియోగించుకుంటోంది. తుంగ, భద్ర సబ్‌ బేసిన్ల నుంచి వస్తున్న నీటిని అక్కడికక్కడే వాడేస్తోంది. మొత్తంగా 600 టీఎంసీల మేర లభ్యత ఉంటుండగా... ఏకంగా 420 టీఎంసీలు వినియోగించుకుంటోంది. తుంగభద్ర నుంచి కూడా ఎప్పటికప్పుడు కాలువలకు నీళ్లు వదులుతోంది. దాంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 40 టీఎంసీలకు మించడం లేదు. దిగువన ఉన్న శ్రీశైలానికి చుక్క నీరు కూడా రావడం లేదు.

దిగువనా దోపిడీ..
తుంగభద్ర దిగువన పరీవాహకంలోనూ ప్రతి సీజన్‌లోనూ 120 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుంది. అందులో 40 నుంచి 50 టీఎంసీలు కర్ణాటక వాడుకున్నా.. 70 టీఎంసీల మేర శ్రీశైలానికి రావాలి. కానీ చుక్క నీరు కూడా రావట్లేదు. కర్ణాటక ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టి, లిఫ్టుల ద్వారా 70 నుంచి 80 టీఎంసీల నీటిని తోడేసుకుంటుండటమే దీనికి కారణం. మరికొంత నీటిని ఏపీ కేసీ కెనాల్, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల ద్వారా తోడేస్తుండటంతో శ్రీశైలానికి నీటి కరువు ఏర్పడుతోంది. ఈ ప్రభావం సాగర్‌పైనా పడుతోంది.

ఆర్డీఎస్‌కూ అడ్డు
తుంగభద్ర బేసిన్‌లో తెలంగాణకు ఆర్డీఎస్‌ కింద 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర లభ్యమవుతోంది. ఆ నీటితో పాత మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 87,500 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముంది.

కానీ కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఆ కాల్వలను ఆధునీకరించేందుకు రాష్ట్రం కర్ణాటకకు రూ.72 కోట్ల మేర చెల్లించింది. కానీ ఏపీ అడ్డుకుంటోందన్న సాకుతో కర్ణాటక ఏళ్లుగా ఈ పనులు చేపట్టడం లేదు. తద్వారా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా నీటిని కూడా కర్ణాటకే వినియోగిస్తూ జల దోపిడీకి పాల్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement