ప్రజాస్వామ్య విలువలు, హక్కుల పరిరక్షణపై తెలంగాణ రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి ఎంతో అప్రజాస్వామికమని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు అన్నారు.
సాక్షి, సిటీబ్యూరో : ప్రజాస్వామ్య విలువలు, హక్కుల పరిరక్షణపై తెలంగాణ రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి ఎంతో అప్రజాస్వామికమని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు అన్నారు. పదేళ్ల విప్లవోద్యమం పురోగతిపై ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించతలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. నియంతల పరిపాలనలోనూ ఇలాంటి నిర్బంధం కనిపించలేదన్నారు. ర్యాలీ, బహిరంగ సభలకు అనుమతిని కోరుతూ తాము హైకోర్టుకు వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు
సదస్సుకే పరిమితం ...
పదేళ్ల విప్లవోద్యమ పురోగతిపై మొదట సదస్సు నిర్వహించి అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ, ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ, పోలీసులు అనుమతి నిరాక రించడంతో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సుకే పరిమితమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందని వరవరరావు చెప్పారు. ప్రొఫెసర్ అమిత్‌భట్టాచార్య, ప్రొఫెసర్ హరగోపాల్, బొజ్జా తారకం తదితరులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. జార్ఖండ్ కళాకారులు జీతన్ మరాండీ నేతృత్వంలోసాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ర్యాలీకి అనుమతి లేదు: డీసీపీ
పత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్ వరవరరావు ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు నేడు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ర్యాలీకి అనుమతి ఇవ్వలేకపోతున్నామని ఆయన తెలిపారు.