
ఆస్తి కోసం ప్రాణం తీశారు
ఆస్తి కోసం కన్నకొడుకు ప్రాణం తీశాడో తండ్రి. ఇందుకు పెద్దకొడుకుతో పాటు మరికొందరి సాయం తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- తండ్రి, అన్నల ఘాతుకం
- హత్యగా తేలిన యువకుడి అదృశ్యం
- నిందితుల అరెస్టు
నాచారం: ఆస్తి కోసం కన్నకొడుకు ప్రాణం తీశాడో తండ్రి. ఇందుకు పెద్దకొడుకుతో పాటు మరికొందరి సాయం తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ఐదుగురు నిందితులను నాచారం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి గ్రామానికి చెందిన కేతావత్ కొమరయ్య రెండవ కుమారుడు రెడ్యానాయక్(36)కు ఏడేళ్ల క్రితం నాచారం సింగం చెరువుతండాకు చెందిన విజయలక్ష్మితో పెళ్లైంది. అప్పటి నుంచి రెడ్యానాయక్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ సింగంచెరువు తండాలోనే ఉంటున్నాడు.
ఇతనికి పిల్లలులేరు. రెడ్యానాయక్ గత మే 27న అదృశ్యమయ్యాడని భార్య నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెల్లెలు పెళ్లి సంబంధం చూడటానికి రమ్మని మామ కొమరయ్య, బావ జహంగీర్ నాయక్ ఫోన్ చేస్తే వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. రెడ్యానాయక్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతను హత్యకు గురైనట్టు తేలింది. ముసాపేటలో తలదాచుకున్న నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు పథకం ఇలా...
హతుడు రెడ్యానాయక్ తండ్రి కొమరయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లికి, వ్యవసాయానికి రూ. 5లక్షల వరకు కొమరయ్య అప్పు చేశాడు. అప్పులో భాగం పంచుకోవాలని తండ్రి కోరగా రెడ్యానాయక్ నిరాకరించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. కొమరయ్యకు జపంల్లి లో 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చిన్నకొడుకు కుటుంబ బాధ్యలు పట్టించుకోవడంలేదని తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
అతడిని చంపేస్తే ఆస్తి మొత్తం తమదే అవుతుందని పెద్దకొడుకు జహంగీర్‌తో కలిసి కుట్రపన్నాడు. జహంగీర్ బీబీనగర్ మండలం మాదారం తండాలో ఉండే తన బావమరిది బానోతు సురేష్(26)ను కలిసి తనకు సహకరించాలని కోరగా.. అంగీకరించాడు. సురేష్ భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాలో ఉండే తన మేన బావమరిది బానోతు రాజేందర్(26)ను కలిసి రెడ్యానాయక్‌ను హత్య చేస్తే రూ. 20 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. పథకంలో భాగంగా మే 26న చెల్లెకు సంబంధం చూడడానికి రాయగిరి వెళ్దామని తండ్రి.. రెడ్యానాయక్‌కు ఫోన్ చేశాడు.
రెడ్యానాయక్‌ను హబ్సిగూడలో కారు ఎక్కించుకుని రాయగిరికి బయలుదేరారు. తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో కారు ఆపారు. డ్రైవర్‌ను అన్నం తిని రమ్మని పంపారు. ఆ తర్వాత తండ్రి కొమరయ్య, అన్న జాహంగీర్, సురేష్, రాజేందర్, లింగాలు కలసి రెడ్యానాయక్‌ను గట్టిగా పట్టుకొని తాడుతో గొంతు బిగించి చంపేశారు.
మృతదేహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశారు. ఇంతలో డ్రైవర్ రావడంతో కారులో వె ళ్లిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్న నాచారం సీఐ అశోక్‌కుమార్, ఎస్సై శ్రీనివాస్, క్రైం పోలీసులను ఏసీపీ అభినందించారు.