అక్రమాలకు నెలవు​​​​​​​ వెంచర్లు | Ventures Establishment Chintapalli In Devarakonda | Sakshi
Sakshi News home page

అక్రమాలకు నెలవు​​​​​​​ వెంచర్లు

Apr 11 2019 3:39 PM | Updated on Apr 11 2019 3:40 PM

Ventures Establishment Chintapalli In Devarakonda - Sakshi

నసర్లపల్లి వద్ద అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్‌ 


సాక్షి, చింతపల్లి : నగరాలు, పట్టణాల్లో  సాగే స్థిరాస్తి వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు నోటీసులతో సరిపెడుతుండడంతో అక్రమ వెంచర్‌దారుల పంట పండుతోంది. హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం సుమారు 32 కి.మీ. మేర విస్తరించి ఉంది.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల ధరలకు ఇటీవల రెక్కలొచ్చాయి. భూములు ప్రస్తుతం రూ.లక్షలు పలుకుతుండడంతో అక్రమ వెంచర్లకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అక్రమ వెంచర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొని ప్లాట్లు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. భూమి మార్పిడి రు సుము చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మండలంలో ఎన్ని వెంచర్లు ఏర్పాటు చేశారు.. ఎన్నింటికి అనుమతులు తీసుకున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. అధికారుల కళ్లముందే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా వారు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 


మండలంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు 
మండలంలోని మాల్‌ వెంకటేశ్వరనగర్, గొడుకొండ్ల, పోలేపల్లిరాంనగర్‌తో పాటు మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమ వెంచర్లు వెలిశాయి. గొడుకొండ్ల గ్రామానికి వెళ్లే దారిలో కృష్ణా జలాశయం ప్లాంట్‌ సమీపంలో, కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలు, గిరిజనతండాలు, విరాట్‌నగర్, అనబోయినపల్లి, వింజ మూరు, నసర్లపల్లి, తీదేడుతో పాటు మండల కేంద్రంలోని మైస మ్మ దేవాలయం, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే దారి తదితర ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు జోరుగా కొనసాగుతున్నాయి. చింతపల్లి మండలం హైదరాబాద్‌ రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండడంతో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న మాల్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ క్రమంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అయితే వెంచర్లకు డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా గ్రామపంచాయతీ అనుమతులతోనే లే–అవుట్‌ తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది పాత సర్పంచ్‌ల పేరిట అనుమతి పత్రాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో లే–అవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ లే–అవుట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.          

కలెక్టర్‌కు ఫిర్యాదు
చింతపల్లి మండలంలో అనుమతులు లేకుండా వెంచర్లు చేశారని స్థానికులు ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్, తహసీల్దార్, విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్‌ అధికారులు చింతపల్లి మండలంలో గతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను పరిశీలించి అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు లేవని వెంచర్ల వివరాలు సేకరించి నేటికీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అక్రమ వెంచర్‌దారులకు నోటీసులు జారీ చేశాం 
గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లకు నోటీసులు జారీ చేశాం. మండలంలోని అనుమతులు లేని వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  
– మమతాబాయి, ఎంపీడీఓ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement