‘మార్పు’ భారం..రూ.4.59 కోట్లు? | Vehicle registrations dwindle in Telangana State | Sakshi
Sakshi News home page

‘మార్పు’ భారం..రూ.4.59 కోట్లు?

Jun 25 2014 3:26 AM | Updated on Aug 29 2018 4:16 PM

‘మార్పు’ భారం..రూ.4.59 కోట్లు? - Sakshi

‘మార్పు’ భారం..రూ.4.59 కోట్లు?

కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. కొత్త జీఓలు, కొత్త పథకాలు, కొత్త నిర్ణయాలు. అంతా కొత్తే. ఇప్పుడు వాహనాల సిరీస్ కూడా కొత్త రాష్ట్రంపై వెలువడింది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ : కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. కొత్త జీఓలు, కొత్త పథకాలు, కొత్త నిర్ణయాలు. అంతా కొత్తే. ఇప్పుడు వాహనాల సిరీస్ కూడా కొత్త రాష్ట్రంపై వెలువడింది. ఏపీ స్థానంలో టీఎస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వాటితోపాటే, పాత వాహనాలకూ రాష్ట్ర సిరీస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. మొదట ఉచితంగానే సిరీస్ మార్పు చేస్తామన్న అధికారులు ఆ తర్వాత డిపార్టుమెంటుపై పడే ఖర్చును పరిగణనలోకి తీసుకుని వాహన యజమానులపైనే ఆ భారాన్ని మోపాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. కేవలం వాహనాలపై సిరీస్ మారిస్తే సరిపోదు.. పాత వాహనాలైనా, కొత్త రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంది. దీంతో ద్విచక్ర వాహనాలకు రూ.100, త్రిచక్ర నుంచి ఆపైన వాహనాలకు రూ.200 చొప్పున వసూలు చేయాలన్న నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. 
 
 జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి 3,57,814 ఉన్నాయి. వీటిలో ఒక్క ద్విచక్ర వాహనాలే ఏకంగా 2,56,531ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు పోను మిగిలిన అన్ని రకాల వాహనాలు కలిపి 1,01,283. ఈ లెక్కన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని అమలుచేయడం మొదలు పెడితే, వాహనాల రాష్ట్ర సిరీస్‌ను మార్పించుకుని కొత్త రిజిస్ట్రేషన్ కార్డులు పొందడానికి జిల్లా వాహన యజమానులపై 4 కోట్ల 59లక్షల 9వేల 700 రూపాయల భారం పడుతుంది. కేవలం ద్విచక్ర వాహనాల ఓనర్లపైనే ఏకంగా 2 కోట్ల, రూ.56లక్షల 53వేల 100ల భారం పడుతోంది. కాగా, ఇతర వాహనాల యజమానులపై ఈ భారం మొత్తం 2కోట్ల 02లక్షల 56వేల 600 రూపాయలుగా లెక్క తేలుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి =దాకా పాత సిరీస్ మార్పు గురించి ఎలాంటి నిర్ణయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు.
 
 ప్రస్తుతానికి జిల్లాకు కేటాయించిన టీఎస్-5 సిరీస్‌లో కొత్త వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాగా, జిల్లావ్యాప్తంగా ఉన్న పాత వాహనాల సిరీస్‌ల మార్పు, మారిని సిరీస్‌తో కూడిన స్మార్ట్ రిజిస్ట్రేషన్ కార్డులు ఎప్పటినుంచి జారీ చేస్తారు అన్న విషయాన్ని అధికారులు కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచే ఇంకా ఎలాంటి నిర్ణయమూ వెలువకడపోవడం, ఓ విధాన నిర్ణయం తీసుకోకపోవడంతో తాత్కాలికంగా వాహన యజమానులకు ఊరట లభించినట్టే. అయితే,అనధికారిక సమాచారం మేరకు ప్రతి ద్విచక్ర వాహనదారుడి నుంచి రూ.100, ఇతర వాహన దారుల నుంచి రూ.200 వసూలు చేయనున్నారు. చూడడానికి చిన్న మొత్తంగానే కనిపిస్తున్నా, జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చూసినప్పుడు మాత్రం మోత భారీగానే ఉంది. ఇక, ఏపీ సిరీస్‌తోనే ఉన్న డ్రైవింగ్ లెసైన్సులను మారుస్తారా..? వాటిస్థానంలో కొత్తవి జారీ చేస్తారా..? అన్న విషయాలు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement