
రైతులను తెరపైకి తెచ్చి..
అడ్డగోలుగా వ్యాట్, సీఎస్‌టీ ఎగవేసిన వర్ని బ్రోకర్లు రైతులను తెరపైకి తెచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
► డిమాండ్ నోటీసుల జారీకి ‘విజిలెన్స్’ సమాయాత్తం
► ఎగవేసిన పన్ను చెల్లించకుంటే కేసులేనంటున్న అధికారులు
సాక్షి, నిజామాబాద్: అడ్డగోలుగా వ్యాట్, సీఎస్‌టీ ఎగవేసిన వర్ని బ్రోకర్లు రైతులను తెరపైకి తెచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల్లో ఎగవేసిన పన్నును వసూలు చేసేందుకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉచ్చు బిగిస్తుండటంతో ఈ బ్రోకర్లు అడ్డదారులు వెతుకుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రికార్డులు విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లడంతో తాము రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడానికి వీలు కుదరడం లేదనే సాకు చెబుతుండటం విమర్శలకు దారితీస్తోంది.
విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రోజు మే 23 నాడే ఈ బ్రోకర్ల వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డులకు సంబంధించిన జిరాక్స్ కాపీలను వారికి ఇచ్చేశామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సంబంధిత బ్రోకర్లే సంతకాలు పెట్టి మరీ ఈ రికార్డుల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లారని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కేఆర్ నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
నేతలతో ఒత్తిళ్లు..
వర్ని, కోటగిరి, బోధన్, బాన్సువాడ తదితర మండలాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించిన ఎనిమిది మంది వర్ని బ్రోకర్లకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సుమారు రూ.56 లక్షలు పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన ఆ విభాగం ఈ మేరకు వారి వద్ద పన్ను వసూలు చేసే చర్యలకు ఉపక్రమించింది. త్వరలో వీరికి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు విజిలెన్స్ విభాగం రంగం సిద్ధం చేస్తోంది.
ప్రాథమికంగా తేలింది రూ.56 లక్షలే అయినప్పటికీ వీరు ఎగవేసిన వ్యాట్, సీఎస్‌టీ రూ.కోటికిపైగా ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ రవాణా చేసిన ఈ బ్రోకర్లు విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగవేసిన ఈ పన్ను వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం.
అధికారుల అలసత్వమే కారణమా?
రూ.కోట్లు విలువ చేసే ధాన్యం యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం రెండు నెలల క్రితం చూసీ చూడనట్లు వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి లైసెన్సులు లేకుండా.. పైసా పన్ను చెల్లించకుండా.. రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని నిత్యం వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తుంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కళ్లుమూసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఈ లారీలు ఏకంగా జిల్లాలు, ఇతర రాష్ట్ర సరిహద్దులు దాటి కర్నాటకకు రవాణా అవుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా అప్పట్లో ట్యాక్స్ పేరుతో వీరి వ్యాపారాన్ని అడ్డుకట్ట వేస్తే ఈ ధాన్యమంతా సర్కారు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తే అవకాశాలుండటంతో జిల్లా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టి సారించడంతో ఈ బాగోతం తెరపైకి వచ్చినట్లుయింది.