జిత్తులమారి కరోనా..

Is Vaccine Preparation Possible For Corona Virus Disease - Sakshi

కరోనా భరతం పట్టేందుకు వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కృషి జరుగుతోంది. అయితే ఈ నావల్‌ కరోనా వైరస్‌ ఎప్పటి కప్పుడు తన రూపాన్ని మార్చు కుంటూ.. పరివర్తనం చెందుతూ శాస్త్రవేత్త లకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 మానవులపై ఎలా దాడి చేస్తుంది.. ఇది తన రూపాన్ని మార్చు కోవడం వల్ల వ్యాక్సిన్‌ తయారీపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది తెలుసుకుందామా..    – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

బేసిక్స్‌ ఫస్ట్‌..
వైరస్‌ అంటే..
సూక్ష్మమైన ఈ పరాన్నజీవి ఆతిథేయి (హోస్ట్‌) శరీరంలోనే వృద్ధి చెందుతుంది.

యాంటీబాడీస్‌..
ఆతిథేయి శరీరంలోని ‘వై’ఆకారంలోని ప్రోటీన్లు.. వెలుపలి నుంచి వచ్చే పరాన్న జీవులను అడ్డుకోవడం లేదా శరీరం నుంచి తొలగిస్తాయి. 

ఆతిథేయిపై వైరస్‌ ఎలా దాడి చేస్తుంది?
1.సార్స్‌ సీవోవీ– 2కు చెందిన స్పైక్‌(కొమ్ము) ప్రోటీన్‌ మానవ కణాల ఉపరితలాన్ని అంటుకుంటుంది. 
2.వైరస్‌ జన్యు పదార్థం ఆర్‌ఎన్‌ఏతో తయారవుతుంది.
3.వైరస్‌ తన జన్యు పదార్థాన్ని మానవ కణంలోకి విడు దల చేస్తుంది. ఆ తర్వాత మానవ కణంలోని ప్రోటీన్లను ఉపయోగించుకుని ఆర్‌ఎన్‌ఏ రెట్టింపు (రెప్లికేట్‌) అవుతుంది.
4.ఇలా తయారైన ఆర్‌ఎన్‌ఏ ఒక దగ్గర చేరి కొత్త వైరస్‌ కాపీలు ఏర్పడతాయి.
5.కొత్త కాపీలు ఏర్పడిన తర్వాత మానవుడి కణం నుంచి బయటకు వస్తాయి.
6.నశించిన మానవుడి కణం ఊపిరితిత్తుల్లో అలాగే ఉండిపోతుంది.

యాంటీబాడీలు ఎలా కాపాడతాయి?
1. కణాలకు అంటుకోకుండా అడ్డుకోవడం..
2.కణంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం..
3. ఆర్‌ఎన్‌ఏ విడుదల కాకుండా చూడటం..
వీటిల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా వైరస్‌ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.

సాధారణ ప్రతిరూపకల్పన.. (రెప్లికేషన్‌)
►వైరస్‌ ఓ కణంలోకి ప్రవేశించి.. అందులోని వ్యవస్థను హైజాక్‌ చేస్తుంది. దాన్ని వాడుకుని వైరస్‌ తన కాపీలను తయారు చేసుకుంటుంది. 

మ్యుటేషన్‌..
►సాధారణంగా కాపీలు తయారయ్యే టప్పుడు చిన్న మార్పులు కూడా మ్యుటే షన్‌కు దారి తీస్తుంది. ఇది ఎక్కువగా జన్యు పదార్థంలో జరుగుతుంది. ఇలా పరివర్తనం చెందిన వైరస్‌తో లాభాలు ఉన్నాయి. ఈ వైరస్‌ లను అడ్డుకునేందుకు ఆతిథేయి శరీరంలో ఎలాంటి యాంటీబాడీలు ఉండవు. దీంతో అవి యథేచ్ఛగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

వ్యాక్సిన్లు..
►వ్యాక్సిన్లు మన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తాయి. ఈ యాంటీబాడీలు వైరస్‌పై ప్రత్యేక స్థానాల్లో (యాంటీజెన్స్‌) అంటుకుని వాటిని నిర్వీర్యం చేస్తాయి.

వ్యాక్సిన్‌పై రూపాంతరం చెందిన వైరస్‌ల ప్రభావం..
సంతతి–ఏ: ఆతిథేయి కణానికి సోకుతుంది. ఆతిథేయి రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్‌పై ఉన్న ప్రోటీన్లను బట్టి గుర్తిస్తుంది.
సంతతి–బి: (రూపాంతరం చెందిన వైరస్‌) సంతతి–ఏ పై పనిచేసే యాంటీ బాడీలు సంతతి–బి ని గుర్తించడంలో విఫలం అవుతాయి. దీంతో వ్యాక్సిన్‌ వ్యర్థం అవుతుంది. 

►ఈ సంతతి–బి వేరే వ్యక్తికి సోకితే.. దాన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త వ్యాక్సిన్‌ కనిపెట్టాల్సి ఉంటుంది.

►కొత్త కొత్త రకాలు, రూపాంతరాలు చెందుతూ ఉంటే.. వాటిని అడ్డుకునేందుకు కొత్త కొత్త వ్యాక్సిన్ల అవసరం పెరుగుతూ ఉంటుంది.

సార్స్‌ సీవోవీ–2
►ఇది పూర్తిగా కొత్త రకం కరోనా వైరస్‌ సంతతి. దీన్ని అడ్డుకునేందుకు మానవులకు ఎలాంటి నిరోధక శక్తి లేదు.

ఏం జరుగుతోంది 
►దీంతో ఈ వైరస్‌పై పనిచేసేలా వ్యాక్సిన్లు తయారుచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ ఎలా రూపాంతరం (మ్యుటేషన్‌) చెందుతోందో గమనిస్తున్నారు.

ఒకవేళ రూపాంతరాలు వైరస్‌–
►యాంటీబాడీ చర్యలకు ఆటంకం కలిగించకపోతే.. వ్యాక్సిన్‌ చాలా మందిపై సమర్థంగా పనిచేస్తుంది.

ఇలా జరిగే చాన్సుంది..
►ఒక్కో సంతతి ఒక్కోలా ప్రవర్తిస్తుంటే.. ఒకే వ్యాక్సిన్‌ పనిచేయదు. అలాంటప్పుడు వ్యాక్సిన్లను అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. 

►వ్యాక్సిన్‌కు అనుగుణంగా వైరస్‌ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు వ్యాక్సిన్లను మళ్లీ మళ్లీ అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top