రెండో అధికార భాషగా ఉర్దూ

Urdu as second official language in Telangana, Bill passed in Assembly - Sakshi - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అమలు

అధికార భాషల చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

గతంలో జిల్లా యూనిట్‌గా అమలు

ఉర్దూ ఉన్నంతకాలం కేసీఆర్‌ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందన్న అక్బరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ గురువారం ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉర్దూకు రెండో అధికార భాష హోదా దక్కాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది.

ఇటీవల 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌ గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయిం చిన ప్రభుత్వం ఈ మేరకు గురువారం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు ఉర్దూ పదాలతో కూడిన హిందీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి తుమ్మల మాట్లాడేటప్పుడు ఉర్దూలో మాట్లాడాలని కొందరు కోరగా త్వరలో తాను ఉర్దూ నేర్చుకుంటాననడంతో సభలో నవ్వులు విరిశాయి.

ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే: అక్బర్‌
దేశంలో ఢిల్లీ తర్వాత ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన రాష్ట్రం తెలంగాణనేనని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ అర్జీలు తీసుకోవడంతోపాటు సంబంధిత వ్యవహారాలు చూసేందుకు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 66 పోస్టులు మంజూరు చేయడంతో ఉర్దూ భాష ఉన్నంతకాలం కేసీఆర్‌ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

తెలుగును పట్టించుకోండి: కిషన్‌రెడ్డి
ఉర్దూకు రెండో అధికార భాష హోదా ఆహ్వానించదగ్గ పరిణామమేనని, కానీ అసలు అధికార భాష తెలుగుకే ఆదరణ లేనప్పుడు ఇక ఉర్దూ గురించి చెప్పేదేముందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక చర్చ జరపాలన్నారు. కాగా, ఉర్దూను రెండో అధికార భాషగా ఖమ్మంలో కూడా అమలు చేయడం సంతోషమని కాం గ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు.  

అర్చకుల వేతన సవరణకు ఆమోదం
 దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణకు సభ పచ్చజెండా ఊపింది. సెక్షన్‌ 65–ఏ ప్రకారం దేవాలయాల నుంచి వసూలు చేసే మొత్తం, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌తో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించనున్నారు. డిసెంబర్‌ నుంచే ఇది అమలు కానుంది. ఇం దుకు సంబంధించి ధార్మిక, హిందూ మత సంస్థ, ధర్మాదాయాల చట్టం–1987కు సవరణను ప్రతిపాదిస్తూ  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. కాగా, తెలంగాణ లోకాయుక్త చట్టం– 1983కి సవరణ ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top