ఉర్సుకు సర్వం సిద్ధం

Urdu Festival Starts in Moulali Hyderabad - Sakshi

నేటి నుంచి మౌలాలిలో ఉత్సవాలు

బాబా దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి

మౌలాలి: హైదరాబాద్‌ మౌలాలి అంటే తొలుత గుర్తుకు వచ్చేది ‘హజ్రత్‌ అలీ బాబా దర్గా’నే. ఈ దర్గాకు చారిత్ర నేపథ్యం ఏంతో ఉంది. ఏటా హజ్రత్‌ అలీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భాగ్యనగరంతో పాటు దేశ విదేశాల నుంచి కులమతాలకు అతీతంగా వచ్చిన ఎందరో హజ్రత్‌ అలీ బాబాను దర్శించుకుంటారు. చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్థిల్లుతున్న ఈ ప్రదేశానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లతో దర్గాపైకి వెళ్లేందుకు ర్యాంప్‌ నిర్మించింది. 

చారిత్రాత్మకం మౌలాలి దర్గా
హైదరాబాద్‌ నగరానికి 11 మైళ్ల దూరంలో ఉత్తర దిశగా 2017 అడుగుల ఎత్తులో గల గుట్టపై మౌలాలి దర్గా ఉంది. దీన్నే ‘కోహి–ఏ–మౌలాలి’ అని కూడా అంటారు. ఇస్లాం దూత హజ్రత్‌ మేల్లుడు హజ్రత్‌ అహ్మద్‌ ముస్తఫా సంస్మరణార్థం దర్గాను నిర్మించినట్లు చరిత్ర కథనం. కులీ కుతుబ్‌షా నవాబ్‌ 1578లో ఈ దర్గాను నిర్మించినట్లు చెబుతారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కలకు ప్రతిరూపమని కూడా కథనం ఉంది. ఏటా ఉర్సు ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అరబ్‌ దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, కువైట్‌ తదితర దేశాల భక్తులు సైతం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
మౌలాలి హజ్రత్‌ అలీ జయంతిని పురస్కరించుకుని ఏటా రజబ్‌ మాసం(ముస్లిం కాలమానిని ప్రకారం) 17వ రోజు మౌలాలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. మౌలాలి దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలు భాగ్యనగరంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. పాతబస్తీ నుంచి పెద్ద ఎత్తున షియా వర్గానికి చెందిన భక్తులు మార్చి 27 అర్ధరాత్రి తమ నివాసాల్లో హజ్రత్‌ అలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల తొలిరోజు, ఐదో రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పాతబస్తీ నుంచి వేలాది ముస్లింలు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులపై ఊరేగింపుగా సందల్‌ తీసుకొస్తారు. బాబాను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సీపీ మహేష్‌ భగవత్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్, ఎస్‌ఐ విష్ణువర్ధన్‌రెడ్డి.. దర్గా కమిటీ సభ్యులు, స్థానికులతో సంప్రదింపులు జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top