‘పని’ పెంచుడే..!

Upadi Hami Pathakam Working Days Increase - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉపాధిహామీ పనులు కల్పించేందుకు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో ఆయా గ్రామాల్లో అడిగిన ప్రతి కూలీకి పని చూపించే విధంగా.. పనులను గుర్తించడంతోపాటు వివిధ కారణాలతో మిగిలిపోయిన పనులను వేగవంతం చేసేందుకు పూనుకున్నారు. ఖరీఫ్‌ సీజన్, వర్షాల కారణంతో జిల్లాలో ఉపాధిహామీ పనులు మూడు నెలల్లో కొంత మందగించాయి. చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ కూలీలు కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి చూపకపోవడం.. ఇతర పనుల ద్వారా ఉపాధి పొందడం వంటి కారణాలతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోలేదు. దీంతో 2018–19లో జిల్లాలో కూలీలకు 58.12 లక్షల పని దినాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగా అధికారులు జిల్లాలో పనులను గుర్తించారు.
 
జిల్లాలో 2018–19లో 52.71 లక్షల పని దినాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కూలీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పని దినాల సంఖ్యను పెంచాలని ప్రణాళికలు వేసింది. దీంతో జిల్లాలో 73.33 లక్షల పని దినాలను పూర్తి చేయా లని ఆదేశించింది. అయితే జనవరి 2019 వరకు 58.12 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. దీనిని చేరుకునేందుకు అధికారు లు పనులపై ప్రచారం కల్పించారు. జాబ్‌కార్డు ఉండి.. ఉపాధి పనికి అర్హుడైన ప్రతి కూలీ పథకాన్ని వినియోగించుకుని ఉపాధి పనికి వచ్చేలా చర్యలు చేపట్టారు.

దీంతో జిల్లాలో ఇప్పటివరకు 86.74 శాతం పనులు కూలీలకు కల్పించినట్‌లైంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సీఆర్‌డీఏ నిర్ణయించిన లక్ష్యాన్ని అందుకునేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు సాగుతుండడంతో ఉపాధిహామీ పథకం ద్వారా చేసే వ్యవ సాయ పనులు ఏమైనా ఉంటే వాటిని చేయించేం దుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూలీలు ఉపాధి పనులు కోరితే వెంటనే వారికి పనులు చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

రూ.93.58కోట్లు ఖర్చు.. 
2018–19లో జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం రూ.93.58కోట్లు ఖర్చు చేసింది. 2,16,713 మంది కూలీలు 50,41,044 పని దినాలను ఉపయోగించుకున్నారు. వీరికి వేతనంగా రూ.61.46కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్‌కు రూ.22.06కోట్లు, అధికారులు, సిబ్బంది జీతాల కు రూ.10.05కోట్లు ఖర్చు చేసింది. కూలి దొరకని ప్రతి పేదవాడికి పని కల్పించి.. పనికి సరిపడా వేతనం దక్కేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. పనికి దరఖాస్తు చేసుకున్న వారం పదిరోజుల్లో పని చూపించేలా గ్రామీ ణ ప్రాంతాల్లో పనులను సైతం సిబ్బంది గుర్తిస్తున్నారు. దీంతో ఉపాధిహామీ పథకం జిల్లాలో లక్ష్యానికి చేరువలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,351 మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద వంద రోజుల పని పొందారు.  
సిద్ధమవుతున్న 2019–20 ప్రణాళిక.. 

2019–20లో కూలీలకు ఉపాధిహామీ పథకంలో కల్పించే పనుల ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించిన సిబ్బంది.. వాటికయ్యే ఖర్చులకు బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద కూలి అడిగిన ప్రతి ఒక్కరికి పనులు చూపించేందుకు వీలుగా పనులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం పథకం కింద కూలీలకు ఉపాధి చూపిస్తున్న సిబ్బంది.. వ్యవసాయ పనులు, కాల్వల మరమ్మత్తు వంటి పనులను పథకం కింద కూలీలకు చూపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.  
 
లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 
జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల లక్ష్యాన్ని అధిగమిస్తాం. కూలి అడిగిన ప్రతి వ్యక్తికి ఉపాధి పథకంలో పని చూపించేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 86.74 శాతం పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. గ్రామీణ ప్రాంత కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తున్నాం. 2019–20 సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికలు పూర్తవుతున్నాయి. త్వరలో బడ్జెట్‌పై ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది.   – ఇందుమతి, డీఆర్‌డీఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top