అన్నదాతకు..భరోసా! 

Union Budget 2019  Farmers Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్‌ జిల్లారైతుల్లో ఆశలు నింపింది. సాగు భారంగా మారి, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలను ఆశ్రయించిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలోనే సాగును పండగ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేర రెండు పంట సీజన్లకు కలిపి ఏటా ఎకరాకు రూ.8వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచుతున్నామని ప్రకటించింది. తాజాగా, శుక్రవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రైతుబంధును పోలిన పథకాన్నే ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ప్రతి ఎకరాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయమే రూ.16వేలు అవుతుంది. దీంతో రైతుల పెట్టుబడి కష్టాలు తీరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, ఐదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతి ఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల రైతులు, రైతు సంఘాల నేతలు హర్షం ప్రకటించారు.

అంగన్‌వాడీ టీచర్లకూ తీపి కబురు
అంగన్‌వాడీ టీచర్లకూ కేంద్ర బడ్జెట్‌ తీపి కబురే అందించింది. వారు ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రతిఏటా జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు అదనంగా రూ.19.41కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2093 అంగన్‌వాడీ కేద్రాలు ఉండగా, వాటిలో 261 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే టీచర్లకు ప్రతినెలా రూ.6700 వేతనం అందుతోంది. అంటే ఏటా రూ.2,09,84,400 వేతనాలు అవుతుండగా 50 శాతం పెంపుతో అదనంగా మరో రూ.1,04,92,200 లభించనున్నాయి.

మరో 1,832 కేంద్రాల్లో అంతే సంఖ్యలో ఉన్న ఆయాలకు ప్రతినెలా రూ.6700 వేతనం లభిస్తోంది. వీరికీ ఏటా అదనంగా రూ.1,04,92,200 ముట్టనున్నాయి. ఇదే కేంద్రాల్లో పనిచేస్తున్న 1832 మంది అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.10వేల వేతనం అందుతోంది. ఇక నుంచి ఈ వేతనం రూ.15వేలు కానుంది. రూ.10వేల చొప్పున ఏటా రూ.21,98,40,000 ఖర్చు అవుతుండగా, ఇపుడు అదనంగా మరో రూ.10,99,20,000 అందనున్నాయి. మొత్తంగా అంగన్‌వాడీ టీచర్లకు ఏటా రూ.19,40,58,600 వేతనాల రూపంలో కేంద్రం అందించనుంది. ఒక్కసారిగా యాభై శాతం పెరిగిన వేతనాలతో అంగన్‌వాడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల హర్షం
కేంద్ర బడ్జెట్‌ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపింది. ఇదివరకటి ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పన్నుల భారంనుంచి బయట పడుతున్నారు. గతంలో రూ.2.50లక్షల రూపాయల వార్షిక వేతన ఆదాయం ఉన్న ప్రతిఉద్యోగి ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని ఈసారి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్‌ మినహాయించే రూ.5లక్షల సీలింగ్‌ పెట్టడంతో ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 41,500 మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు సగానికిపైగానే ఉంటారని అంచనా.  ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top