ఖమ్మం మార్కెట్ యార్డులో ఆగ్రహించి దాడికి పాల్పడింది రైతులే అని నిరూపిస్తే వారి కాళ్లు పట్టుకుంటారా అని టీఆర్‌ఎస్ నేతలకు టీడీపీ సవాల్ విసిరింది.
టీఆర్‌ఎస్ నేతలకు తెలుగుదేశం పార్టీ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో ఆగ్రహించి దాడికి పాల్పడింది రైతులే అని నిరూపిస్తే వారి కాళ్లు పట్టుకుంటారా అని టీఆర్‌ఎస్ నేతలకు టీడీపీ సవాల్ విసిరింది. ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటనలో దాడి చేసింది రైతులే అని తాము నిరూపించగలమని సండ్ర చెప్పారు. వరుస సెలవుల కారణంగా ఖమ్మం మార్కెట్ మొత్తం మిర్చితో నిండిపోవడంతో రైతులు రోడ్లపైనే మిర్చి నిల్వలను గుమ్మరిం చారన్నారు.
ఈ క్రమంలో రోడ్లపై ఉన్న మిర్చిని మార్కెట్ కంటే తక్కువ ధరకు కోనుగోలు చేయాలన్న పథకంతో వ్యాపారస్తులు వేలంపాట పాడకుండా క్వింటాల్‌కు రూ.2 వేలతోనే కొనేసేందుకు ప్రయత్నించారని, మే 1 నుంచి ఆ మేరకే కొనుగోలు చేస్తామనే వదంతులు సృష్టించారని చెప్పారు. దీంతో భయభ్రాంతులకు గురైన రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టారన్నారు. తమ పార్టీ కేసులకు భయపడదని, మిర్చి రైతుల సమస్య తీర్చే వరకు విశ్రమించదన్నారు.