ఆర్టీసీ సమ్మె: వాడీవేడి వాదనలు

TSRTC Strike: TS Govt Files Counter In High Court - Sakshi

అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారు

ఉపఎన్నికకు100 కోట్ల వరాలపై హైకోర్టు సెటైర్లు

ఆర్టీసీ ఎండీ విచారణకు ఒక్కసారైనా హాజరయ్యారా?

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు చేసిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. ఆర్టీసీకి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ. 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగే చోట రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా? లేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇతర బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  సమ్మెపై ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే బస్సులు లేక ఇబ్బంది పడతారని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరు అయ్యారా? అని ప్రశ్నించింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరూర్‌ నగర్‌లో రేపు 2గంటల నుంచి 6 గంటల వరకు అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె వలన కార్మికులు చనిపోయారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడం కోసం సభ ను ఏర్పాటు చేశామని వివరించారు. దీనిపై విచారించిన హైకోర్టు సరూర్ నగర్ లో కాకుండా ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మంగళవారం సాయంత్రం లోపు తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రభుత్వానికి గడువు విధించింది. అనంతరం​ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top