‘కేసీఆర్‌పై యుద్ధం చేసేవారిని అభినందిస్తా’

TSRTC Strike: Manda Krishna Madiga Comennts in Sakala Janula Samarabheri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్‌ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను సాగనంపుదాం
సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్‌ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.

ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్‌ ఆరోపించారు. కేసీఆర్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top