తరుముతున్న డెడ్‌లైన్‌.. కార్మికుల్లో టెన్షన్‌!

TSRTC Strike : CM KCR Deadline.. Tension in RTC Workers - Sakshi

నేటి అర్ధరాత్రితో ముగియనున్న సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌

సాక్షి, హైదరాబాద్: గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి బేషరతుగా విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డెడ్‌లైన్‌ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ గడువు మరికాసేపట్లో ముగియబోతుండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌కు కార్మికులు తలొగ్గుతారా? లేక సమ్మెను కొనసాగిస్తారా? కార్మికులు దిగిరాకపోతే.. కేసీఆర్‌ అన్నట్టే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు చేస్తారా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆఫర్‌కు కార్మికుల నుంచి ఓ మోస్తరుగా స్పందన వస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం డెడ్‌లైన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. బస్‌భవన్‌ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్టు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యాలయాల్లో, ఆర్‌ఎం కార్యాలయాల్లో నేటి అర్ధరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 రూట్లను ప్రైవేటీకరించిన సంగతి తెలిసిందే. డెడ్‌లైన్‌లోపు కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్‌ చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించినా కార్మికులు విధుల్లో చేరేది లేదని, ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తోంది. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందేనని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేస్తోంది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఉండాలని అంటున్నారు.

 ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top