చార్జీల మోత?

TS RTC Ticket Prices Hikes Soon - Sakshi

డీజిల్‌ ధర పెంపుతో ఆర్టీసీపై రూ.70 కోట్ల అదనపు భారం

ఇప్పటికే రూ.928 కోట్లకు చేరుకున్న నష్టాలు

ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే రూ.550 కోట్లకు పైగా నష్టాలు

చార్జీలు పెంచడం తప్ప గత్యంతరం లేదంటున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో మరోసారి చార్జీలు పెరగనున్నాయా..ప్రయాణికులపై భారం పడనుందా..పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అదొక్కటే పరిష్కారమా...ఆర్టీసీ అధికారవర్గాలు, రవాణా రంగ నిపుణులు అందుకు అవుననే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే వందల కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీపై తాజాగా పెరిగిన డీజిల్‌ ధరలు మరింత భారాన్ని మోపాయి. దీంతో చార్జీల పెంపు ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. తెలంగాణ అంతటా సుమారు రూ.928 కోట్ల నష్టాలను  ఎదుర్కొంటుండగా ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఆర్టీసీ నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. తాజాగా లీటర్‌కు సుమారు రూ.2.56 చొప్పున పెరిగిన డీజిల్‌ ధరల కారణంగా ఆర్టీసీపైన ఏటా రూ.70 కోట్ల వరకు భారం పడనున్నట్లు అంచనా.

డీజిల్‌ పై పెరిగిన ధరలు కేవలం ఇంధన వినియోగంపైనే కాకుండా విడిభాగాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులపైన కూడా ప్రభావం చూపుతాయి. దీంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారం నుంచి కొంత మేరకు ఊరట పొందేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.‘డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఆ భారం ప్రయాణికులపై పడకుండా జాగ్రత్త వహించాం. ఒకవైపు వందల కోట్ల నష్టాలను భరిస్తూ, మరోవైపు  ఏటేటా పెరిగే డీజిల్‌ ధరల భారంతో ఏ మాత్రం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది’ అని  పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సైతం చార్జీలపైన నిర్ణయం తీసుకొనే స్వతంత్రత ఆర్టీసీకి ఉండాలని ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించకపోవడంతో చార్జీల పెంపు  ప్రస్తావన ముందుకొస్తోంది. అందుకు  ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు  చెప్పారు. 

ప్రజలపై ఏటా రూ.300 కోట్లకు పైగా భారం...
ఆదాయానికి రెట్టింపు ఖర్చు ఆర్టీసీని  నిలువునా ముంచుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి రోజు రూ.3.5 కోట్ల ఆదాయం లభిస్తే  ఖర్చు మాత్రం  రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. రోజుకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లుతోంది. మొత్తం తెలంగాణలోని సగానికి పైగా నష్టాలు హైదరాబాద్‌లోనే వస్తున్నాయి. ప్రైవేట్‌ వాహనాల అక్రమ రవాణా, స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్‌ బస్సుల కారణంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టాలొస్తున్నాయి. వరుస నష్టాలను దృష్టిలో ఉంచుకొని 2016 లో చార్జీలను పెంచారు. మొదట  10 శాతం పెంచాలని భావించినప్పటికీ కొన్ని రూట్లలో చార్జీల హెచ్చుతగ్గులు, హేతుబద్ధత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవడంతో 8.77 శాతం పెంపు అమల్లోకి వచ్చింది. ప్రయాణికులపై కిలోమీటర్‌కు రూపాయి చొప్పున భారం పడింది.

సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులపై కొద్దిగా తగ్గించి, లగ్జరీ, మెట్రో డీలక్స్, ఓల్వో, గరుడ వంటి వాటిపైన పెంచారు. ఆ ఏడాది పెంచిన చార్జీల వల్ల  ప్రజలపైన రూ.250 కోట్లకు పైగా భారం పడింది. ఈ మేరకు ఆర్టీసీకి ఆదాయం లభించినప్పటికీ  నష్టాల నుంచి  గట్టెక్కేందుకు పెద్దగా దొహదం చేయలేదు. నిర్వహణ భారం అధికంగా ఉండడం, ఇంధన ధరలు, జీతభత్యాల్లో పెంపుదల వంటి అంశాల కారణంగా  వరుసగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ  ఏడాది ఇప్పటి వరకు రూ.928 కోట్లకు చేరాయి. ఈ  మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్ధిక సహాయం లభించకపోవడంతో  ఆర్టీసీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కనీసం  10 శాతం చార్జీలు పెరిగినా ఆర్టీసీకి  రూ.300 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని భావిస్తున్నారు. కానీ ఈ మేరకు ఆ భారాన్ని ప్రజలు మోయక తప్పదు.  

సుంకం పెంపుతో డీజిల్‌ భారం రూ.70 కోట్లు
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సుంకం పెంపుతో వాటి ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో లీటర్‌ డీజిల్‌కు రూ.2.56 చొప్పున  ఆర్టీసీపైన సుమారు రూ.70 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు  తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు 5,30 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2 లక్షల లీటర్‌లకు పైగా డీజిల్‌ ఖర్చవుతోంది.ఆర్డినరీ బస్సులు  ఒక లీటర్‌ డీజిల్‌ వినియోగంపై   5.52 కిలోమీటర్‌ల వరకు తిరుగుతుండగా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఇది 4.5 కిలోమీటర్‌ల వరకే ఉంటుంది.  ఏసీ బస్సుల్లో ఇంకా  తగ్గుతుంది. ఏసీ బస్సులు 2.5 కిలోమీటర్‌ల నుంచి 3 కిలోమీటర్‌ల వరకు తిరుగుతాయి. ట్రాఫిక్‌ రద్దీ, బస్సుల సామర్ధ్యం వంటి అంశాలు కూడా ఇంధన వినియోగంపైన ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు నష్టాలు, మరోవైపు ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని  కనీసం 10 శాతం పెంచినా కొంత మేరకు ఊరట లభించగలదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top