రాష్ట్రంపైకి మిడతల దండు?

TS Govt Alerted To On Locust Swarm Attack - Sakshi

ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశం

నియంత్రణ చర్యలు చేపడుతున్న అక్కడి అధికారులు

ఒకవేళ కంట్రోల్‌ కాకుంటే తెలంగాణలోకి వచ్చే అవకాశం

అప్రమత్తమైన వ్యవసాయశాఖ.. నిపుణులతో అత్యవసర సమీక్ష

సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశం

జిల్లా, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచన

 సాక్షి, హైదరాబాద్ ‌: మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి ఆగమేఘాల మీద ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని వివరించారు. ఒకవేళ అక్కడ దండు కంట్రోల్‌ కాకపోతే తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.

మిడతల దండు గంటకు 12–15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాల్లో నిఘా బృందాలను (వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలతో) ఏర్పాటు చేయాలని సూచించారు. సస్యరక్షణ పరికరాలను, రసాయన మందులను అంచనా వేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. రక్షిత సస్యరక్షణ మందులను వాడాలని, నివాస ప్రాంతాల్లో సస్యరక్షణ మందుల పిచికారీ చేయరాదని ఆదేశించారు. మిడతల దండును సామూహికంగా నివారించే విషయంపై రైతులను చైతన్యం చేయాలన్నారు. గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మిడతల దండు ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్‌ మీదుగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించింది. ఒక్కో మిడత రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది. వాటిలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. జూన్‌లోగా వాటి సంఖ్య 400 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వై.జి. ప్రసాద్, ఎస్‌.జె. రహ్మాన్, ఆర్‌.సునీత, ఎం.నర్సింహారెడ్డి తదితర శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top