ఎన్ని పార్టీలు ఏకమైనా కారుదే జోరు | Sakshi
Sakshi News home page

ఎన్ని పార్టీలు ఏకమైనా కారుదే జోరు

Published Fri, Nov 23 2018 6:01 PM

TRS Will Form The Government Pongulati Srinivasa Reddy  - Sakshi

సాక్షి,ఎర్రుపాలెం: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీ కొట్టే శక్తి ఏ కూటమికీ లేదని, ఈ ఎన్నికల్లో 100 సీట్లల్లో గెలుపొందడం ఖాయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి మధిర టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ గెలుపు కాంక్షిస్తూ అభ్యర్థితో పాటు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి  మండలంలోని కొత్తగోపరం, గుంటుపల్లి గోపవరం, భీమవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో రోడ్‌షోలు చేస్తూనే పలువురిని పలకరించి తనదైన శైలిలో ఓట్లడిగారు. ఎంపీ పొంగులేటి పర్యటనకు మంచి స్పందన వచ్చింది. మహిళలు నీరాజనం పట్టారు. కొత్తగోపవరం గ్రామంలో 30 కుటుంబాలు పార్టీలోకి చేరాయి. వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వంలో బలమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ ఉందని, జిల్లాలో ఓటమి బెంగతోనే ప్రతిపక్షాలు కుట్ర పన్ని తానేదో పార్టీ మారుతున్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని , అలా చేసేవారు పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలో 10 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే అక్కసుతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మధిర నియోజవర్గంలో అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు మంచి ఆదరణ వస్తుందని, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భట్టికి ఓటేస్తే అభివృద్ది జరగదని, ఆయన అందుబాటులోనే ఉండరని, దళిత అహంకారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, భద్రాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, గూడూరు రమణారెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి నర్సిరెడ్డి తదితరులున్నారు. 


 

Advertisement
Advertisement