వ్యూహాల్లో  అ‘ద్వితీయం’ 

 TRS  Second-Class Leaders Are Campaigning - Sakshi

గ్రామాల్లో పట్టు సాధించేందుకు నేతల యత్నాలు 

ఓట్లు రాబట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు

షాద్‌నగర్‌ టౌన్‌: ఎన్నికల్లో విజయతీరం చేరుకోవాంటే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరుపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వాటిని నేతలు పసిగట్టి అప్రమత్తం అయితే ఫలితాన్ని సునాయసంగా అందుకోవచ్చు. అందుకు తగ్గట్లు నేతలు పావులు కదపాలి. తద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి గల్లీకి వెళ్లి చక్రం తిప్పలేరు. దీనికోసం ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అద్వితీయమైన వ్యూహాలు రచిస్తూ పార్టీతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.   

ప్రధాన అనుచరులే అండ.. 
నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు ఉంటారు. వీరే పార్టీ అభ్యర్థులకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. వీరు కార్యకర్తలను ఏకం చేయడం, ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మామూలు సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర అన్ని పార్టీల్లో కీలకంగా మారుతుంటుంది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించడం.. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పావులు కదుపుతున్నారు. బరిలో ఉండే తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుల సమాచారాలను చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు.   

అనుక్షణం.. అప్రమత్తం 
అనుక్షణం ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికలను గమనిస్తూ వారి కోటలను బద్దలు కొట్టి తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతుంటారు. పార్టీ బలాన్ని పెంచడంతో పాటుగా ఎదుటి పార్టీలో అలకబూనిన నేతలను, అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి అక్కున చేర్చుకొని సరికొత్త వ్యూహాలను అమలు చేసే బాధ్యతను నేతలు తమ భుజాలపై వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఓట్లు వేయించి ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగేలా దూసుకెళ్తున్నారు. అన్ని తామై వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణినేతలు ఆయా గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు.

గెలుపోటముల్లో కీలక పాత్ర 
ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండో శ్రేణి నేతలది కీలక పాత్ర. ఎన్నికల నేపథ్యంలో ప్రతిచోట నాయకులు పార్టీలు మారడం, కొత్త వారిని పార్టీల్లోకి చేర్చడంలో అభ్యర్ధుల ప్రధాన అనుచరులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగే సమాయానికి ఓటర్లను ఆకట్టుకొని వారి ద్వారా ఓట్లు వేయించే విషయంలోనూ వీరిపాత్ర అద్వితీయం. ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు పాలించాలంటే ఈ నేతలే కీలకంగా మారుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top