నల్లగొండలో ప్రచారానికి.. గులాబీ పదును!

Trs  Party Strategic On Election Public Meetings - Sakshi

అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార సభలు

 29వ తేదీన సీఎం బహిరంగ సభ

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది.  ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉండడంతో నియోజకవర్గస్థాయి సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా గ్రామ గ్రామం తిరిగి కార్యకర్తలను కలిసేంత సమయం ఈ ఎన్నికలకు లేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే.. తక్కువ సమయంలో ఎక్కువ  మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసేలా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుపుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అన్న అంశాలను స్థానిక కేడర్‌కు వివరించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మండలాలను, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు గ్రామాల బాధ్యతను అప్పజెబుతూ కిందిస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రచారంలో మమేకం చేసేలా వ్యూహం సిద్ధం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృతంగా తిరిగి ప్రజలను కలిశారు. పార్లమెంట్‌ ఎన్నికల కోసం మరోమారు గ్రామాలకు వెళ్లేందుకు, ప్రజలను కలిసి వివరించేందుకు తయారవుతున్నారు. 

రోజుకు రెండు చొప్పున సమావేశాలు
శనివారం నల్లగొండ, సూర్యాపేటలో నియోజకవర్గ కార్యకర్తలను సమీకరించి సభలు నిర్వహించారు. ఆదివారం దేవరకొండ, హుజూర్‌నగర్‌లో మీటింగులు ఏర్పాటు చేశారు. 26వ తేదీన మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గంలో సమావేశాలు ఉంటాయి. 27వ తేదీన  నాగార్జునసాగర్‌  నియోజకవర్గంలో సమావేశం జరగనుంది. ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు సైతం ప్రచారంలో భాగంగా రోడ్‌షోలలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎంపీ అభ్యర్థి మెజారిటీ కోసం ఎమ్మెల్యేలకు టార్గెట్లు
నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఏ సెగ్మెంటుకు ఆ సెగ్మెంటు ఎమ్మెల్యేకే అన్ని బాధ్యతలు అప్పజెప్పారు. ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఎక్కువ పోలింగ్‌ జరిగేలా.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే అత్యధిక ఓట్ల మెజారిటీ పార్టీ ఎంపీ అభ్యర్థికి వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలకే పెట్టారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్ల మెజారిటీ కంటే ఈసారి మరిన్ని ఓట్లు వచ్చేలా టార్గెట్లు పెట్టారని అం టున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి 1.93లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు ఒక్క సూర్యాపేట మినహా ఆరు చోట్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఇది సాధ్యమైందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎన్నికల నాటికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఆరు శాసన సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలవగా, ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఆధిక్యం 1.07లక్షల ఓట్లు.

అయితే, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఏడువేల ఓట్ల మెజారిటీని తీసేసినా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఓట్ల అధిక్యం ఒక లక్ష. ఈ మెజారిటీ సరిపోదని, ఏడు సె గ్మెం ట్లలో ప్రతిచోటా కనీసం పాతిక వేల నుంచి 30వేల ఓట్ల మెజారిటీ కోసం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. పార్టీ అభ్యర్ధి మెజారిటీ రెండు లక్షలు దాటుతుందని లెక్కలు గడుతున్నారు. ఈ మేరకు మెజారిటీ సాధించేందుకు ఎమ్మెల్యేలపై బాధ్యత పెట్టారని, దానిలో భాగంగానే నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుపుతున్నారని పేర్కొంటున్నారు.

కాగా, ప్రతి సమావేశానికి అభ్యర్థితో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు, కార్పొరేషన్‌ పదవుల్లో ఉన్న వారు హాజరవుతారని చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను రాబట్టేలా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని గులాబీ నేతలు అమలు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top