వ్యూహమా.. సహజమా?

TRS Leaders Discontent In Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది?  ప్రజా ప్రతినిధులు అధినేత నిర్ణయాన్ని ఎందుకు  ధిక్కరిస్తున్నారు? వేలాది మంది కార్యకర్తలు హన్మకొండలోని సర్క్యూట్‌ హౌస్‌ను ముట్టడించడం వ్యూహమా? ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మౌనం వెనుక మతలబు ఏమిటి?  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలను ఒక్కరోజులో పరిష్కరించిన ‘గులాబీ’ దళపతి స్టేషన్‌ఘన్‌పూర్‌ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. టీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకర్గ అభ్యర్థిని ఖరారు చేసిన నాటి నుంచి ఇక్కడ రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి రాజయ్యకు టికెట్‌ కేటాయించగానే రాజారపు ప్రతాప్‌ తిరుగుబాటు చేశారు. అవినీతిపరులకు టికెట్లు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. తనకు పార్టీ నుంచి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తనకు  పార్టీ నుంచి టికెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని ఊళ్లలో తిరుగుతూ  చెబుతున్నారు. తన వర్గానికి చెందిన కార్యకర్తలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు.

మూడు, నాలుగు రోజుల తర్వాత..
టీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించిన మూడు, నాలుగు రోజుల తర్వాత కడియం శ్రీహరి అనుచరులు ఒక్కసారిగా వేడి పుట్టించారు. రాజయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో  ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజయ్యకు టికెట్‌ ఇస్తే ఓట్లు వేయమని తీర్మానం చేశారు. అనంతరం  చిల్పూరు మండలం పల్లగుట్టలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. రాజయ్య మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు టికెట్‌ రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అదే వేదిక మీద నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు గానీ,  తిరుగుబాటు నేత రాజారపు ప్రతాప్‌కు గానీ టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకొచ్చారు.  మరోసారి మండలస్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 10 వేల మందితో హైదరాబాద్‌కు వెళ్లి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించాలని ప్రణాళిక వేసుకుని, ఆగిపోయారు.

ఆశీర్వాదం తర్వాతే..
ఈ క్రమంలో రాజయ్య గొంతును పోలిన స్వరంతో  ఓ మహిళతో శృంగార పరమైన ముచ్చట్లకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో కంగుతిన్న రాజయ్య మరుసటి రోజే నేరుగా హైదరాబాద్‌లోని కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదించాలంటూ కాళ్లు çమొక్కారు. రాజకీయంగా సహకరించమని కోరారు.  ఇక అప్పటి నుంచే నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. తాజాగా శనివారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి వేలాది మంది టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హన్మకొండకు చేరుకుని కడియం శ్రీహరి బస చేసిన సర్క్యూట్‌ అతిథి గృహాన్ని ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. అయితే ఈసారి వారి డిమాండ్‌ మారింది.

నిన్న మొన్నటి వరకు కడియం కావ్యకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. ఈ రోజు కడియం శ్రీహరే అభ్యర్థిగా నిలబడాలని, ఆయనకే టికెట్‌ ఇవ్వాలనే నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు కరపత్రాలను వాహనాలకు అతికించారు. కార్యకర్తల ధర్నాతో అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన కడియం శ్రీహరి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ క్రమశిక్షణ గల నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.  నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ఆశించిన అభివృద్ధి జరగలేదనే బాధ ఉందని, కడియం శ్రీహరి మళ్లీ వస్తే నియోజకవర్గం బాగుపడుతుందనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చినట్లు నేను భావిస్తున్నాను.  వారి బాధను నాకు, పార్టీకి  చెప్పుకోవటానికి ఇక్కడకు వచ్చారు. వారి బాధను, ఆవేశాన్ని, ఆవేదనను, అభిప్రాయాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా.’ అని హామీ ఇచ్చారు.
 
ఇంటెలిజెన్సీ చూస్తోంది..!
టికెట్ల కేటాయింపుల అనంతరం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగట్టి కేసీఆర్‌కు  చేరవేసేందుకు పోలీసు ఇంటెలిజెన్సీ కార్యచరణలోకి దిగినట్లు తెలుస్తోంది. అభ్యర్థులపై పెల్లుబికిన అసమ్మతి, అందుకు గల కారణాలు?  టికె ట్లు  ఆశించి భంగపడిన అభ్యర్థుల ప్రమేయం, ఇ తరత్రా అంశాలను ఎప్పటికప్పుడు సేకరించి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఆడియో క్లిప్పింగ్‌ను, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తిరుగుబాటు స్వరాల ఉనికిని ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలకు నిశితంగా గమనిస్తున్న ముఖ్యమంత్రి.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థిత్వంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top