‘ఢీ’సెంబర్‌ 7

TRS Leaders Disagreement Nizamabad - Sakshi

సమయం ఖరారైంది.. ఇక, సమరానికి తెర లేవనుంది.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రచార హోరుతో రాజకీయం రంజుగా మారిన నేపథ్యంలో సీఈసీ ప్రకటన మరింత వేడిని పెంచింది. ప్రధాన పార్టీలన్నీ మరింత వేగంగా కదన రంగంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
 

సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలై నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై నిన్న మొన్నటి వరకు రకరకాల ఊహాగానాలు రావడంతో అయోమయం నెలకొంది. మరోవైపు, కోర్టు కేసుల నేపథ్యంలో ఏం జరుగుతుందని ఉత్కంఠ కొనసాగింది. అయితే, రాష్ట్రంలో డిసెంబర్‌ 7న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది.

సీఈసీ షెడ్యూల్‌ ప్రకటించడంతో ప్రస్తుతం అంతటా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 19 వరకు కొనసాగనుంది. 20న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం డిసెంబంర్‌ 7న ఎన్నికలు జరుగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
 
మొదలైన సన్నాహాలు.. 
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజక వర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఏర్పడిన అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, వారు క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించారు.

మిగతా పార్టీలు అభ్యర్థులను త్వరగా ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నెల 12న విడుదల కానుండడంతో నెల రోజుల కాలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేతలు ‘అన్ని రకాల’ ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.

వేడెక్కిన రాజకీయం.. 
ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్‌లో హన్మంత్‌ సింధే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడానికి సన్నద్ధమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధం నెలకొంది.

కామారెడ్డిలో ప్రచార హోరు.. 
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ పేరు దాదాపు ఖరారైనట్లే. దీంతో ఆయన నెల రోజులుగా నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన షబ్బీర్‌అలీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత నెల 30న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించడం ద్వారా క్యాడర్‌లో జోష్‌ పెంచారు. అంతటితో ఆగకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజా సమస్యలే ఎజెండాగా జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఎల్లారెడ్డిలో.. 
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురైదుగురు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే, టిక్కెట్‌ ఎవరికి వచ్చినా కలిసే పని చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఇటీవల అందరు కలిసి నియోజక వర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పేరును ఖరారు. అయితే, ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ లో టిక్కెట్‌ రాని వారికి గాలం వేయాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

బాన్సువాడ, జుక్కల్‌లో.. 
బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురైదుగురు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ప్రచార వేడి పెరగనుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌కు పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్‌ పేరు దాదాపు ఖరారు కాగా, ఆయన ప్రచారం మొదలుపెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top