జగిత్యాల: ప్రతీ పల్లె వికసించాలన్నదే నా కల 

TRS Dharmapuri MLA Candidate Interview with 'Sakshi'

ఏడాదిలోగా ధర్మపురి టెంపుల్‌సిటీ

సిద్దిపేట తరహాలో అభివృద్ధి  

గోదావరి ప్రక్షాళనకు చర్యలు  

70వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులు  

‘సాక్షి’తో టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ 

‘ప్రచారం కోసం నేను ఏ పల్లెకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఈసారి కారుగుర్తుకే ఓటేస్తామంటున్నరు. నాపై పూర్తి విశ్వాసంతో మళ్లీ గెలిపించుకుంటామని తీర్మానాలు చేస్తున్నరు.  కేసీఆర్‌ ఆశీస్సులతో నాలుగేళ్లలో రూ.1,230 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచి.. మరింత అభివృద్ధి చేస్తా. ప్రతీ పల్లెను వికసింపజేసి.. అన్ని మండలాలను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేయాలన్నదే నా ధ్యేయం’ అని టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల ఐదోసారి ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సౌమ్యుడు.. స్నేహశీలిగా పేరొందిన కొప్పుల ఎన్నికలలో ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రజల స్పందన.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి? అధికారంలోకి వస్తే చేయనున్న పనులపై ఆయన మాటల్లోనే...

– సాక్షి, జగిత్యాల  

సాక్షి, జగిత్యాల:  నియోజకవర్గంలో దాదాపు 70వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రాజెక్టులు, లిఫ్టులు, కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ధర్మపురి, బీర్‌పూర్‌ మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 30 వేలకు పైగా ఎకరాలకు తాగు, సాగునీరందించేలా బీర్‌పూర్‌ మండలంలో రోళ్లవాగు ప్రాజెకుŠట్‌ నిర్మాణ, ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆరు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న బొల్లిచెరువు ఆధునికీకరణ పనులతో మరో 5వేల ఎకరాలకు సాగునీరందనుంది. వీటితోపాటు నియోజకవర్గ పరిధిలోని స్తంభంపల్లి, వెల్గటూరు, జగదేవ్‌పూర్, దమ్మన్నపేట, అక్కపల్లిలో లిఫ్ట్‌ల పనులు జరుగుతున్నాయి. రంగదామునిపల్లి బైపాస్‌ కెనాల్, పత్తిపాక బొమ్మెనపల్లి కాలువ, మద్దులపల్లి లింగాపూర్, అంబరిపేట కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. రూ.7 కోట్లతో మేడారం తూముల ద్వారా వెల్గటూరులోని 11 గ్రామాలకు సాగునీరందించేలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.5 కోట్లతో 31 చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కొనసాగుతున్న పనులు పూర్తి చేయడంతోపాటు నియోజకవర్గంలో మరో 30 వేల ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేస్తా.

 
ధర్మపురి టెంపుల్‌ సిటీ 
సమైక్యవాదుల పాలనలో తెలంగాణలోని అన్ని దేవాలయాలు ఆదరణకు నోచుకోలేకపోయాయి. ముఖ్యంగా దక్షిణకాశీగా పేరొందిన ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయానిదీ ఇదే పరిస్థితి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించడంతో(కొంతభాగం)పాటు టెంపుల్‌ సిటీలా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నం. ఇప్పటికే రూ.50 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులతో ఎలాంటి పనులు చేపట్టాలి? ఇంకెన్ని నిధులు అవసరం? అనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నం. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ఏడాదిలోగా లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని టెంపుల్‌సిటీగా మారుస్తా. ఇదే క్రమంలో ధర్మపురి నుంచి మురుగునీరంతా పవిత్ర గోదావరిలో చేరుతున్నాయి. వచ్చిన నిధుల్లోంచి రూ.6 కోట్లతో గోదావరి నది ప్రక్షాళన చేయబోతున్నాం.  

కొత్త కొత్తగా ! 
మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయడమే కాకుండా పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరు చేసుకున్నాం.  

ధర్మపురిలో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించుకోబోతున్నాం:
ధర్మపురిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం, పెగడపల్లి, వెల్గటూరులో జ్యోతిబాపూలే, ధర్మపురిలో మైనార్టీ బాలికల, గొల్లపల్లిలో ఎస్సీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేయించుకున్నాం. ధర్మపురిలో డిగ్రీ, గొల్లపల్లి, వెల్గటూరులో జూనియర్‌ కాలేజీ మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. కొత్తగా బుగ్గారం మండలాన్ని మంజూరు చేసుకున్నం. 21 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నం. రూ.37 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు నిర్మించుకున్నాం. ముఖ్యంగా పెగడపల్లి నుంచి గుండి, వెల్గటూరు నుంచి కల్లెడ, చిల్వకొడూరు నుంచి ఐతుపల్లి, రాష్ట్ర రహదారి– 7 నుంచి మల్లాపూర్‌ వరకు, ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి, అప్రోచ్‌ రోడ్డు నుంచి బానంపల్లి, పాతగూడురు నుంచి మేడారం, శానబండ నుంచి గొడిసెలపేట వరకు, గొల్లపల్లి నుంచి మల్లన్నపేట, వెంగళాపూర్‌ నుంచి గుట్టలపల్లి, బీర్సాని నుంచి మద్దనూరు వరకు, జైన నుంచి తీగలధర్మారం వరకు రోడ్ల నిర్మాణాలు చేపట్టుకున్నం. గుంజపడుగు, పాతగూడురు, దీకోండ, మ్యాకవెంకయ్యపల్లి, బుచ్చయ్యపల్లి, తిరుమలాపూర్, శెకల్లా, ఐతుపల్లి, ల్యాగలమర్రిలో వంతెన నిర్మాణాలు జరిగాయి. కొత్తగా ఎనిమిది విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించుకున్నాం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top