ప్రసంగాలకే పరిమితం

ప్రసంగాలకే పరిమితం - Sakshi


ఉట్నూర్/ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా సన్నిధిలో నిర్వహించిన దర్బార్ ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమైంది. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో కలెక్టర్ జగన్‌మెహన్ అధ్యక్షతన నిర్వహించిన నాగోబా దర్బార్‌కు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.



కాగా.. సభా వేదికపై ఆదివాసీ నాయకులను ఆహ్వానించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వారసుడు కొమురం సోనేరావ్‌ను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జోగు రామన్న సోనేరావ్‌ను సభాపైకి ఆహ్వానించకపోవడంలో తప్పు జరిగిందని, తప్పుకు క్షమిం చాలని ప్రకటించారు.



పలువురు ఆదివాసీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు న మోదై తిరుగుతున్నామని విన్నవించడంతో హోంమంత్రితో మాట్లాడుతామన్నారు. కాగా.. సిర్పూర్(టి) ఎ మ్మెల్యే కోనేరు కోనప్ప సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్, ఎమ్మెల్సీ రాములునాయక్, ప్రభు త్వ విప్ నల్లాల ఓదెలు, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎస్‌ఎస్‌రాజు, కేస్లాపూర్ సర్పంచ్ నాగ్‌నాథ్, జెడ్పీటీసీ సంగీత, అలయ కమిటీ చైర్మన్ తుకారాంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇక్కడి సమస్యలను వివరించడానికి జిల్లాలోని గిరిజన సంఘాల నాయకులను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా జోడేఘాట్‌కు రాలేదని, గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృతనిచ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. జోడేఘాట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.18 కోట్లు విడుదల చేసిందన్నారు.



జిల్లా నుంచి ఏర్పడే మరో జిల్లాకు కొమురం భీమ్ పేరు పెట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు కొమురం భీమ్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రభుత్వం పేరు మార్చుతుందన్నారు. ప్రతి గూడెంకు, తండాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఐటీడీఏకు పూర్తిస్థాయి పీవోను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నాటికి నాగోబా సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో జిల్లాను కేసీఆర్ మరో కశ్మీర్‌లా తీర్చిదిద్దుతారని వివరించారు.

 

అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం..

జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా సన్నిధిని ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ వ్యాపించడంతో చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయ్యిందని, ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రులుగా తాము వచ్చామన్నారు.ఆదివాసీలు విన్నవించిన ప్రతి సమస్యనూ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.



దర్బార్‌లో వచ్చే ప్రతి అర్జీని విభాగాల వారీగా వేరు చేసి పరిష్కరిస్తామన్నారు. ముత్నూర్ నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ఆలయం ప్రాంగణంలో విశ్రాంతి గృహాల నిర్మాణం, ఆలయ భూముల రక్షణ, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. రూ.రెండు కోట్లతో నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మెస్రం వంశీయులు కోరుతున్నారని, వచ్చే ఏడాది నాటికి నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉట్నూర్ సీహెచ్‌సీని ఆధునికీకరించి ఏజెన్సీలో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ముంద స్తు చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇంద్రవెల్లి : నాగోబా సన్నిధిలో గురువారం మం త్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే లు రే ఖానాయక్, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపూరావ్, నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీబి చైర్మన్ దామోదర్‌రెడ్డితో పాటు కలెక్టర్ జగన్‌మోహన్ తదితర ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మెస్రం వంశీయులు వారికి ఆ దివాసీ సంప్రదాయం ప్రకారం తలపాగా కట్టి, గు స్సాడీ బృందం నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భం గా భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఎస్పీ తరుణ్‌జోషి, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, సర్పంచ్ నాగ్‌నాథ్, గ్రామ పటేల్ వెంకట్‌రావ్ తదితరులు ఉన్నారు.

 

సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుదాం..

ఆదివాసీల సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, రోడ్ల అభివృద్ధితోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. రానున్న రోజుల్లో జంగుబాయి, పద్మల్‌పురిగుడిరేవు, జోడేఘాట్, నాగోబా, మార్లవాయి ప్రాంతాలను ప్రభుత్వం అన్నిరకాల అభివృద్ధి చేస్తుంది. వచ్చే బడ్జెట్‌లో కేస్లాపూర్‌లో కొత్త కాలనీల నిర్మాణానికి కృషి చేస్తాం.

 - గేడం నగేష్, ఎంపీ

 

అభివృద్ధే ద్యేయం..

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటోంది. 67 ఏళ్ల సమైక్య పాలనలో లేని నాగోబా ఆలయ అభివృద్ధి వచ్చే రెండు మూడేళ్లలో జరుగుతుంది. మె స్రం వంశీయుల విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

 - రాథోడ్ బాపూరావ్,ఎమ్మెల్యే, బోథ్

 

స్వయం అభివృద్ధి సాధించేలా..

ఆదివాసీలు అన్ని రంగాల్లో స్వయం అభివృద్ధి సాధిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జల్ జంగల్ జమీన్ నినాదంతో హక్కుల కోసం పోరాడిన ఘనత ఆదివాసీలదే. కేసీఆర్ ఆదివాసీల కోసం రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయనున్నారు. ఆధునిక వ్యవసాయంపై గిరిజనులకు ఆసక్తి పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల కోసం కల్యాణ లక్ష్మీ పథకం ప్రారంభించిన ఘనత కేసీఆర్‌దే.

 - నల్లాల ఓదెలు, ప్రభుత్వ విప్

 

ప్రమాదమైన వాటిని రద్దు చేయాలి..

ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న టైగర్‌జోన్‌ను వెంటనే రద్దు చేయాలి. కుంటాల ప్రాజెక్టు ఆదివాసీ దేవుళ్లకు పవి త్రమైన ప్రదేశం. అక్కడ హైడల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయా లి. ఎన్నికల హామీలో భాగంగా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. గిరిజన విద్యాభివృద్ధికి చర్యలు ఉండాలి.

 - సోయం బాపూరావ్, బోథ్ మాజీ ఎమ్మెల్యే

 

వచ్చే సంవత్సరం నాటికి సమస్యలు పరిష్కారం..

నాగోబా ఆలయం తన అసెంబ్లీ పరిధిలో ఉండడం నా అదృష్టం. నాగోబా ఆలయ సన్నిధిలో ఉన్న సమస్యలన్నీ వచ్చే జాతర నాటికి పరిష్కరించేలా కృషి చేస్తా. ఆలయం వరకు రోడ్ల నిర్మాణం, శాశ్వత స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. ఏజెన్సీలో అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు అభివృద్ధి చెందడం లేదు. వాట న్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేలా కృషి చేస్తా.

 - అజ్మీరా రేఖ, ఖానాపూర్ ఎమ్మెల్యే

 

వారి పాలనలో అన్యాయం..

సమైక్య రాష్ట్రంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగింది. గిరిజనాభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం దూసుకెళ్తోంది. వచ్చే ఆరు నెలల్లో ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనుంది.

 - రాములు నాయక్, ఎమ్మెల్సీ

 

వారిని ఆహ్వానించకపోవడం బాధాకరం..

నాగోబా దర్బార్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించడం ఆనందమే అయినా.. సభా వేదికపైకి ఆదివాసీల నాయకులను ఆహ్వానించకపోవడం బాధాకరం. జిల్లాలో ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వం వివిధ రకాలుగా ఇచ్చిన భూములు పదిహేను ఎకరాలకు పైగా ఉండడంతో వారికి ఆహారభద్రత కార్డులు ఇవ్వడం లేదు. గిరిజనుల్లో 55 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి.

 - ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే

 

నాగోబా సమస్యలు పరిష్కరించాలి..

నాగోబా అలయంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆల య ప్రాంగణంలో డార్మెంటరీల నిర్మాణంతోపాటు శాశ్వత విశ్రాంతి భవనాలు నిర్మించాలి. ఆలయం చుట్టు పక్కల ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి అలయానికి కేటాయిస్తూ చుట్టూ ప్రహరీ నిర్మించాలి. మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.

 - నాగ్‌నాథ్, కేస్లాపూర్ సర్పంచ్, తుకారాం నాగోబా ఆలయ కమిటీ చెర్మన్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top