ఇం'ధన' మంట! | Sakshi
Sakshi News home page

ఇం'ధన' మంట!

Published Mon, Sep 10 2018 2:33 AM

Transport sector in crisis with rising diesel prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇం‘ధన’మంట నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అసలే నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు అశనిపాతంలా మారాయి. వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు వారాల్లోనే లీటరుపై దాదాపుగా రూ.3.18లు పెరిగింది. దీంతో రోజుకు రూ.23 లక్షల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితీ ఇలానే ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్, లారీలు, క్యాబ్‌లు, ఆటోల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడమే నేటి భారానికి కారణమని రవాణా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.

లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బ
పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు రవాణా రంగానికి కీలకంగా ఉన్న లారీల యజమానులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అన్‌ సీజన్‌ కారణంగా లారీలకు గిరాకీ లేదు. దీనికితోడు పెరుగుతున్న డీజిల్‌ ధరలు వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో కేవలం బొగ్గు, సిమెంటు రవాణా లారీలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి.

తాజా పరిస్థితులతో వ్యాపారం సరిగా సాగక.. యజమానులు వాయిదాలు కట్టలేకపోతున్నారు. రెండు వాయిదాలు దాటితే.. లారీలను ఫైనాన్స్‌ వ్యాపారులు లాక్కెళ్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకోవాలని తెలంగాణ లారీల అసోషియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వెంటనే వ్యాట్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని మినహాయించి డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement