ట్రాఫిక్‌ సైరన్‌

Traffic Restrictions In Hyderabad For Ganesh Nimajjanam - Sakshi

నిమజ్జనం వేళ ఆంక్షలు షురూ

నగర వ్యాప్తంగా66 ప్రాంతాల్లో అమలు

ఖాళీ వాహనాలకు ప్రత్యేక మార్గం

సందర్శకులకు పార్కింగ్‌ ఏర్పాట్లు

నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవ ఘట్టం ‘సామూహిక నిమజ్జనం’ ఆదివారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు గ్రేటర్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు పోలీస్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపేయడం చేస్తారన్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అవసరాన్ని బట్టి వీటినిపొడిగించే అవకాశం ఉందన్నారు. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రధాన ఊరేగింపు మార్గం
కేశవగిరి–నాగుల్‌చింత–ఫలక్‌నుమ–చార్మినార్‌–మదీనా–అఫ్జల్‌గంజ్‌–ఎంజే మార్కెట్‌–అబిడ్స్‌–బషీర్‌బాగ్‌–లిబర్టీ–అప్పర్‌ ట్యాంక్‌/ఎన్టీఆర్‌ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది.

సికింద్రాబాద్‌ వైపు నుంచి..
ఆర్పీరోడ్‌–ఎంజీ రోడ్‌–కర్బాలా మైదాన్‌–ముషీరాబాద్‌ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌– నారాయణగూడ ‘ఎక్స్‌’ రోడ్‌–హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్‌ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది.

ఈస్ట్‌జోన్‌ నుంచి..
ఉప్పల్‌–రామంతపూర్‌–అంబర్‌పేట్‌–ఓయూ ఎన్‌సీసీ–డీడీ హాస్పిటల్‌ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద సికింద్రాబాద్‌ రూట్‌లో కలుస్తుంది.
వెస్ట్‌ జోన్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్‌ మీదుగా సెక్రటేరియేట్‌ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.
నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించేందుకు కేవలం బషీర్‌బాగ్‌ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్‌ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం.
వెస్ట్‌–ఈస్ట్‌ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్‌ వద్దే అవకాశం ఉంటుంది.  
వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌ రింగ్‌రోడ్, బేగంపేట్‌ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.  

ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్స్‌
1. సౌత్‌ జోన్‌: కేశవగిరి, మొహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్‌షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్‌
2. ఈస్ట్‌ జోన్‌: చంచల్‌గూడ జైల్‌ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జ్, సాలార్జంగ్‌ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్‌ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌
3. వెస్ట్‌ జోన్‌: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్‌ చౌరస్తా, ఉస్మాన్‌ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్‌ ఐలాండ్, బర్తన్‌ బజార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌
4. సెంట్రల్‌ జోన్‌: చాపెల్‌ రోడ్‌ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్‌ సెంటర్, షాలిమార్‌ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్‌ రోడ్‌ ఎంట్రీ, హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చౌరస్తా, కంట్రోల్‌రూమ్‌ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్‌ ఆఫీస్‌ ‘వై’ జంక్షన్, బీఆర్‌కే భవన్, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్‌ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్‌ పార్క్, వైశ్రాయ్‌ హోటల్‌ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు
5. నార్త్‌జోన్‌: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్‌ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్‌ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్‌’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి.
మెట్రో రైల్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీ హాల్, ఆర్‌ అండ్‌ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్‌ ఫుడ్‌ వరల్డ్, సత్యం థియేటర్‌ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు.  

సందర్శకులకు పార్కింగ్‌ ఇలా..
హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు. ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్‌ మధ్య, బుద్ధభవన్‌ పక్కన, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్స్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్‌. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు చేరుకోవాలి.

నిమజ్జనం తర్వాత..
విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్‌ రోటరీ, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్‌ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్కు, డీబీఆర్‌ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్‌ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్‌ రైల్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ మీదుగా అనుమతించరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్‌ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.  

ఆర్టీసీ బస్సులకూ..
ట్రాఫిక్‌ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయని పోలీస్‌ అధికారులు ప్రకటించారు. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రేతిఫైల్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, క్లాక్‌ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, నల్గొండ చౌరస్తాను దాటి ముందుకు రానీయరు.  

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు..
నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్లిస్తారు.  

అందుబాటులో హెల్ప్‌లైన్స్‌
ట్రాఫిక్‌ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం అందుబాటోకి తెచ్చారు. ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top