మాపై గురుతర బాధ్యత ఉంది | to partner in development of golden Telangana | Sakshi
Sakshi News home page

మాపై గురుతర బాధ్యత ఉంది

Jun 16 2014 12:55 AM | Updated on Mar 28 2018 11:05 AM

మాపై గురుతర బాధ్యత ఉంది - Sakshi

మాపై గురుతర బాధ్యత ఉంది

60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరి.. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తమపై గురుతర బాధ్యత వుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

  •  తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసికట్టుగా పనిచేయాలి
  •  రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
  •  ఇబ్రహీపట్నం రూరల్: 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరి.. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తమపై గురుతర బాధ్యత వుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని  ఓ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లను టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సన్మానించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగేటి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధి గురించి దేశంలోని అన్ని వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు.
     
     తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించాల్సి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణలో తొలిగా అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు తాము తప్పకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.  చంద్రబాబు చెప్తున్న 100 సింగపూర్ సిటీలను తెలంగాణలోనూ నిర్మించుకునే సత్తా మనకుందన్నారు. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుంటే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమేనన్నారు. ప్రతీ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
     
     అదే విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పట్నం పెద్ద చెరువులో నీటిని నింపి ఈ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని అన్ని రకాలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా ప్రతీ గ్రామానికి తాగునీరు అందించి ఇక్కడి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పలు ఐటీ కంపెనీల రాకతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ వచ్చింద ని, రైతులు భూముల్ని ఇప్పుడే అమ్ముకోవద్దని సూచించారు.  పాలమూరు- జూరాల నుంచి నీటిని తరలించి పట్నం పెద్ద చెరువును నింపేందుకు కృషి చేస్తామన్నారు.
     
    ఉద్యమంలో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పాలుపంచుకోవాలన్నారు. పార్టీ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, సామల రంగారెడ్డి, జేపీ శ్రీనివాస్‌రావు, డబ్బీకార్ శ్రీనివాస్, బర్ల జగదీశ్ యాదవ్, బోసుపల్లి గణేశ్, మండల ప్రధానకార్యదర్శి కావలి లక్ష్మణ్, పలు గ్రామాల నాయకులు దోర్నాల మల్లేశ్, గొరిగె క్రిష్ణ, మాయిని అమర్నాథ్, మడుపు గోపాల్, బోసుపల్లి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement