మార్చ్‌కు వేలాదిగా తరలి రండి

జేఏసీ, వామపక్షాల పిలుపు 

అరెస్టులు చేయడం అప్రజాస్వామికమంటూ మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఉమ్మడిగా నిర్వహించ తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి  యాత్రకు వేలాదిగా తరలి రావాలని జేఏసీ, వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా స్ఫూర్తి యాత్ర నిర్వహించి తీరుతామని ప్రకటించాయి. తెలంగాణ జేఏసీ, వామపక్షాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జేఏసీ కో కన్వీనర్‌ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్థన్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేత రవిచంద్ర తదితరులు సమావేశమై మిలియన్‌ మార్చ్‌ను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. 

యాత్ర నిర్వహించి తీరుతాం.. 
సమావేశం అనంతరం జేఏసీ నేత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహించనున్న స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వకపోగా, అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా శాంతియాత్రను నిర్వహిస్తామని వెంకటరెడ్డి చెప్పారు. పోలీసుల బెదిరింపులకు, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహించాలనుకున్న స్ఫూర్తి యాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి ఇంకా పెద్దదిగా చేసిందన్నారు. 

సీఎం జోక్యం చేసుకోవాలి: చాడ 
మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి యాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవడానికి సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని అనుమతిని ఇప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. మిలియన్‌ మార్చ్‌ అనేది తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టమని, దీనిని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top