వంట గ్యాస్‌... మూడు మొక్కలు | Three Plants Distribute Every One cooking gas cylinder Booking In Hyderabad | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌... మూడు మొక్కలు

Jul 31 2018 11:25 AM | Updated on Sep 4 2018 5:53 PM

Three Plants Distribute Every One cooking gas cylinder Booking In Hyderabad - Sakshi

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే చాలు...మీ ఇంటికి నిండు సిలిండర్‌తో పాటు ఇకపై మూడు మొక్కలు ఉచితంగా అందనున్నాయి.హరితహారంలో భాగంగా ఇంటింటికీ  మొక్కలు పంపిణీ చేయాలని సిటీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది.

సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో వంట గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసిన వినియోగదారులకు ఉచితంగా మొక్కలు అందచేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. ఈ మేరకు  గ్యాస్‌ గోదాముల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు గృహ అవసరాలకు ఉపయోగించే తులసి, కరివేపాకు, ఇతర పండ్ల, పూల మొక్కలు గ్యాస్‌ వినియోగదారులకు కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు స్థలం లేని వారు సైతం కుండీల్లో పెట్టుకొని మొక్కలు పరిరక్షించేందుకు వీలుగా చిన్నిచిన్న మొక్కలనే అందించాలని నిర్ణయించారు. ప్రతి గృహోపయోగ గ్యాస్‌ వినియోగదారు ల కుటుంబం కనీసం ఒక మొక్క అయినా పరిరక్షించే విధంగా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. ఇకపై వంట గ్యాస్‌ బుకింగ్‌ చేసిన వారికి సిలిండర్‌ డెలివరీ చేసే బాయ్‌లే మొక్కలు కూడా వారికి అందచేస్తారు.

గ్రేటర్‌లో 26.21 లక్షలు కుటుంబాలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వంట గ్యాస్‌ వినియోగ కుటుంబాలు సుమారు 26.21 లక్షలకు పైబడి ఉన్నారు. వీరికి మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 135 ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా జరుగుతోంది. ప్రతి రోజు డిమాండ్‌ 1.20 లక్షలు సిలిండర్ల వరకు డిమాండ్‌ ఉండగా కనీసం 80 వేలకు తగ్గకుండా డోర్‌ డెలివరీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్యాస్‌ వినియోగదారులకు హరితహారంలో భాగంగా ఇంటింటికి సిలిండర్‌తోపాటు మొక్కలు అందించేందుకు గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. ఇటీవల గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బాధ్యులు సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ను కలిసి హరిత హారంలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నర్సరీల ద్వారా గ్యాస్‌ గోదాముల వారిగా మొక్కలు సరాఫరా చేసేందుకు అధికార వర్గాలు అంగీకరించాయి. 

34 నర్సరీల్లో మొక్కల పెంపకం
నగరంలోని 34 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వేప, జువ్వి, కానుగ, జమ్మితో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. గృహోపయోగ గ్యాస్‌ వినియోగదారుల కోసం మాత్రం ఔషధ, పూల మొక్కలను సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్‌ గోదాములకు మొక్కలు సరఫరా కాగానే సిలిండర్లతోపాటు వాటిని పంపిణీ చేసే విధంగా డిస్ట్రిబ్యూటర్లు సంసిద్ధులవుతున్నారు.

మొక్కలను పరిరక్షించండి  
మానవుడి మనుగడకు పర్యావరణ పరిరక్షణ అవసరం. అందుకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి కార్యక్రమం. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇంటింటికీ సిలిండర్‌తో పాటు ఉచితంగా పంపిణీ చేసే మొక్కలు వృథాగా పారేయకుండా పరిరక్షించాలి. ఇంట్లో మొక్కలు నాటేందుకు స్థలం లేనివారు కూడా కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. అప్పుడే ఇంటి ముందు పచ్చతోరణం కళకళాడుతుంది. ఇది కుటుంబం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. – అశోక్‌కుమార్, ఎల్పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల సంఘం, గ్రేటర్‌ హైదరాబాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement