విషాదం : ముగ్గుర్ని మింగిన వాగు.. 

Three People Died By Dip Into Stream Near Husnabad Siddipet - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌ : వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు అందులో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండ లం వరుకోలులో జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాగులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఇసుక గుంతలో మునిగి మృత్యువాత పడ్డారు. వరుకోలుకు చెందిన ఏడుగురు స్నేహితులు పెందోట వరప్రసాద్‌ (21), కంటే నిఖిల్‌ (18), కూన ప్రశాంత్‌ (22)లు వారి స్నేహితులు శ్యామకూర రామకృష్ణ, అజయ్, దూడం రంజిత్, శనిగరం పవన్‌ కల్యాణ్‌లతో కలసి స్నానం చేసేందుకు వాగులోకి దిగారు.

వీరిలో రామకృష్ణ ఒక్కడికే ఈత వస్తుంది. ముందుగా నిఖిల్‌ వాగులోకి దిగగా అప్పటికే ఇసుక కోసం తీసిన గుంతలోకి వెళ్లి కాపాడండంటూ అరిచాడు. ఒడ్డున ఉన్న మిగతా స్నేహితులు ఈత రాదనే విషయాన్ని మర్చిపోయి నిఖిల్‌ను కాపాడేందుకు వాగులోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు ఆ ఇసుక గుంతలో మునిగిపోయారు. గమనించిన రామకృష్ణ నీటిలో మునిగిన అజయ్‌ ఒక్కడినే ఒడ్డుకు చేర్చాడు. మిగతా ముగ్గురు నీటిలో మునిగిపోయారు.  

వారసులు లేకుండా పోయారంటూ.. 
నీటిలో మునిగిన 20 నిమిషాల తర్వాత వరప్రసాద్, నిఖిల్, ప్రశాంత్‌ మృతదేహాలు నీటిలో తెలియాడుతూ కనిపించాయి. చుట్టుపక్కలవారు యువకుల మృతదేహాలను వాగులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ముగ్గురూ వారి కుటుంబాల్లో ఒక్కొక్క మగ సంతానమే కావడంతో వారసుడు లేకుండా పోయాడని వారి తల్లిదండ్రులు రోదించిన తీరు కలిచివేసింది. వరప్రసాద్, బీఫార్మసీ, నిఖిల్‌ ఇంటర్మీడియట్, ప్రశాంత్‌ డిగ్రీ చదువుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top