స్టీరింగ్ ఆటో, టిప్పర్ ఢీ

స్టీరింగ్ ఆటో, టిప్పర్ ఢీ - Sakshi


పుల్‌కల్ : ఎదురెదురుగా వస్తున్న స్టీరింగ్ ఆటో, టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన దండుగల నరసింహులు (42), అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శోభ (28), కమ్మరికత్త గ్రామానికి చెందిన స్వరూప (30)లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబాలు పనుల నిమిత్తం పటాన్‌చెరు ప్రాంతానికి వలస వచ్చారు.

 

అయితే సోమవారం స్వ గ్రామానికి బయలుదేరారు. అందులో భాగంగానే పటాన్‌చెరు నుంచి జోగిపేట కు వెళుతున్న స్టీరింగ్ ఆటోను ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం పుల్‌కల్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్టీ యూ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు, శోభ, స్వరూపలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

 

 బైక్‌పై వెళ్లింటే...

స్వరూప, సుధాకర్ దంపతులు కూడా కూలీ పనుల నిమిత్తం పటాన్‌చెరు లింగంపల్లికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే కుమారులు స్వగ్రామంలో చదువుతుండగా.. వీరిని కమ్మరికత్తలో వదలాల ని దంపతులు నిర్ణయించారు. అందులో భాగంగానే సోమవారం సుధాకర్, ఇద్దరు కుమారులు బైక్‌లో బయలుదేరగా.. స్వరూప కుమార్తె నిఖితలు ఆటోలో బయలుదేరారు. అయితే స్వరూపను వృుత్యువు ఆటో రూపంలో కబలించగా.. నిఖిత స్వల్పగాయాలతో బయటపడింది.

 

కాగా ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు పూర్తిస్థాయి సమాచారం కోసం సుధాకర్ మోబైల్‌కు ఫోన్ చేశారు. అతను సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బైక్‌లో అందరం వచ్చి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వారం కాదా అంటూ సుధాకర్ విలపించడం అక్కడివారిని కలిచివేసింది. గాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top