కలప అక్రమ తరలింపులో స్మగ్లర్లను వదిలిపెట్టడంతోపాటు కేసును పక్క దోవ పట్టించారనే ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డీఎఫ్‌వో శనివారం ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
ఖానాపూర్ (ఆదిలాబాద్) : కలప అక్రమ తరలింపులో స్మగ్లర్లను వదిలిపెట్టడంతోపాటు కేసును పక్క దోవ పట్టించారనే ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డీఎఫ్‌వో శనివారం ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ అటవీ కార్యాలయం ఆవరణలో ఉన్న 14 దుంగలను కొందరు వ్యక్తులు గత నెల 27వ తేదీన టాటా ఏస్ వాహనంలో తరలించుకుపోయారు. దీనిపై అప్పట్లో అధికారులు.. కరీంనగర్ జిల్లా వైపు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.50 వేల విలువైన కలపను పట్టుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ కలప తరలింపు వెనుక స్థానిక అటవీ అధికారుల ప్రోద్బలం ఉందని, స్మగ్లర్లను వదిలిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పట్టుబడిన వాహనం నంబర్ ఆధారంగా అధికారులు విచారణ చేయగా అది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన రొయ్యల సురేశ్‌దిగా తేలింది. అతనిని విచారించగా షాకీర్ అనే వ్యక్తికి వాహనాన్ని లీజుకిచ్చినట్లు వెల్లడించాడు. దీంతో షాకీర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కలప అక్రమ తరలింపు రుజువైంది. ఈ విషయంతో సంబంధమున్న సత్తన్‌పల్లి ఎఫ్‌ఎస్‌వో ఎ.రవీందర్, స్పెషల్ డ్యూటీపై ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్‌ఎస్‌వో సమీ ఉల్లాఖాన్, ఎక్బాల్‌పూర్ ఎఫ్‌బీవో జాఫర్ హైమద్‌లను సస్పెండ్ చేస్తూ శనివారం నిర్మల్ డీ ఎఫ్‌వో సీపీ వినోద్ ఉత్తర్వులు జారీ చేశారు.