నిండా ముంచారు..! | those are cheating me | Sakshi
Sakshi News home page

నిండా ముంచారు..!

May 27 2014 3:22 AM | Updated on Sep 2 2017 7:53 AM

నిండా ముంచారు..!

నిండా ముంచారు..!

తనకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కొండా మురళీధర్‌రావు నిండా ముంచారని టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు

 గీసుకొండ, న్యూస్‌లైన్ : తనకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కొండా మురళీధర్‌రావు నిండా ముంచారని టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ గీసుకొండ మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో హన్మకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఓటమికి కారణాలపై సహోదర్‌రెడ్డి విశ్లేషించారు.

మండలంలో బూత్‌ల వారీగా ఓటింగ్ తగ్గటానికి దారి తీసిన పరిస్థితులపై పోస్టుమార్టం నిర్వహించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే మొలుగూరి పట్టించుకోలేదని, కొందరు న్యాయవాదుల సహకారంతో ముందుకెళ్లినట్లు సహోదర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కొండా మురళీధర్‌రావు గీసుకొండలో ప్రచారం చేయడానికి వస్తానని చెప్పి రాలేదని, ఆయన స్వగ్రామం వంచనగిరిలోనే టీఆర్‌ఎస్‌కు గణనీయంగా ఓటింగ్ తగ్గిందని అన్నారు.
 
 గతంలో కొండా సురేఖకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇంత తక్కువ ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మొలుగూరి, సురేఖకు వచ్చిన ఓట్లను చూస్తే తాను సునాయసంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నానని, అయితే నాయకుల మోసం కారణంగా ఓడి పోయానని కార్యకర్తలు, నాయకుల ఎదుట వాపోయారు. పార్టీ తరఫున టికెట్ కొంత ఆలస్యంగా ఖరారు కావడంతో ఎవరు ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కన్నా ప్రచారంలో ముందుండడంతోపాటు ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఏమాత్రం వేనకడుగు వేయలేదని ఆయన  స్పష్టం చేశారు.
 
 ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరికి ఓటు వేసిన వారు ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ చేశారని, అందుకే ఓడిపోయినట్లు కొందరు నాయకులు చెప్పిన విశ్లేషణలతో సహోదర్‌రెడ్డి ఏకీభవించలేదు. రాష్ట్రం మొత్తంలో టీఆర్‌ఎస్ గాలి ఉంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీలోని కొందరు నాయకుల తీరు వల్లే ఓడిపోయామని పలువురు ఆరోపించారు. పాత టీఆర్‌ఎస్ నాయకులు సరిగా పని చేయలేదని ఓ వ్యక్తి చేసిన ఆరోపణతో సమావేశంలో కొంత సేపు గొడవ  జరిగింది.  
 
 నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించాలి
 సహోదర్‌రెడ్డిని పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించాలని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ మండల కమిటీ  తీర్మానించింది. ఈ సందర్భంగా గతంలో పార్టీని వీడి వెళ్లిన అనంతారం గ్రామ నాయకుడు దూడె మొగిలి తిరిగి సహోదర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల కన్వీనర్ చింతం సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మంద ఐలయ్య, బెంబిరి బాబూరావు, వీరగోని రాజ్‌కుమార్, వీరాటి లింగారెడ్డి, గంగుల రమేశ్. పోలెబోయిన ప్రభాకర్, ఊకల్ సొసైటీ చైర్మన్ రాజు, సర్పంచ్‌లు మానయ్య, బీమగాని సౌజన్య, కొంగ సురేందర్, తరగల ప్రసాద్, సాంబరెడ్డి, ల్యాదళ్ల బాలు, రాంబాబు, తాబేటి సదానందం, ఆలేటి సాంబమూర్తి, రాములు నాయక్, ముంత రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement