స్తంభాల కిందే సమాధి | The tractor roll over electric poles at lingapur | Sakshi
Sakshi News home page

స్తంభాల కిందే సమాధి

May 19 2016 3:29 AM | Updated on Oct 4 2018 7:01 PM

స్తంభాల కిందే సమాధి - Sakshi

స్తంభాల కిందే సమాధి

దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బుధవారం బోల్తా పడింది.

లింగాపూర్ వద్ద విద్యుత్ స్తంభాల ట్రాక్టర్  బోల్తా
ముగ్గురి దుర్మరణం ఏడుగురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం కూలీ పనికొచ్చి కానరాని లోకాలకు...

 
వాళ్లంతా పొట్టచేత పట్టుకుని కూలీ పని కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద చేరారు. ఉన్న ఊరు వదిలి మరో ఊరికి కూలీ పనికి వచ్చారు. కూలీ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను ఒక చోటు నుంచి మరో చోటికి ట్రాక్టర్‌లో తరలించే క్రమంలో వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వలస కూలీల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
 
దండేపల్లి : దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కూలీలపై విద్యుత్ స్తంభాలు పడటంతో బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ వార్డుకు చెందిన పెద్దల పోషం(45), గౌతురె మల్లేశ్(18), కౌటాల మండలం గంగాపూర్‌కు చెందిన తుమ్మెడ విశ్వనాథం(50) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయూలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.


 ప్రాణాలు తీసిన అతివేగం
 దండేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ట్రాక్టర్‌లో 12 విద్యుత్ స్తంభాలను ఎక్కించుకుని తాళ్లపేట వైపు తరలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలను అక్కడ దించడం కోసం 11 మంది కూలీలు కూడా అదే ట్రాక్టర్‌లోనే వెళ్తున్నారు. ట్రాక్టర్‌ను డ్రైవర్ అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి లింగాపూర్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో స్తంభాలపై కూర్చుని ఉన్న కూలీలపై విద్యుత్ స్తంభాలు పడటంతో ముగ్గురు దుర్మరణం చెందగా, ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ మోహన్, దండేపల్లి, లక్సెట్టిపేట, జ న్నారం ఎస్సైలు రాములు, అశోక్, లింగమూర్తి తమ సిబ్బందితో వెంటనే అక్కడకు చేరుకున్నారు. 108 అంబులెన్సులో క్షతగాత్రులను లక్సెట్టిపేట, మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. స్తంభాల కింద ఇరుక్కుని ఉన్న మృతదేహాలను, తీసి పోస్టు మార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు తుమ్మెడ విశ్వనాథంకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పెద్దల పోషంకు రెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఓ కొడుకు ఉన్నాడు. గౌతూరి మల్లేశ్ ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఇతడికి తల్లిదండ్రి ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, అతడు పరారీలో ఉన్నాడని సీఐ మోహన్ తెలిపారు. ఈ మేరకు దండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నడీ రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడి రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను, విద్యుత్ స్తంభాలను తొలగింపజేశారు.


 గాయపడిన వారు వీరే..
 ఈ ఘటనలో ఏడుగురు మధునయ్య, లచ్చన్న, శ్రీనివాస్, బాపురావు, రాజు, జలేందర్, తిరుపతి, గాయపడ్డారు. వీరిలో కొందరిని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో, మరికొందరిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్న మధునయ్యను కరీంనగర్‌కు రెఫర్ చేశారు. క్షతగాత్రులందరిది బెజ్జూర్, కౌటాల మండలాలు. కుటుంబాలను ఆదుకుంటాం  - కోనేరు కోనప్ప, సిర్పూర్(టి) ఎమ్మెల్యే

 ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
 
 
 పంటలు పండక.. వలస ‘పోయి..’
కౌటాల : మండలంలోని గంగాపూర్‌కు తుమ్డి విశ్వనాథ్(40) లింగాపూర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. విశ్వనాథ్‌కు వ్యవసాయ భూమి ఉన్నా కరువు ప్రభావంతో ఖరీఫ్‌లో ఆశించిన స్థాయి పంటలు పండలేదు. వేసవిలో గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో కూలీ కోసం విశ్వనాథ్ దండేపల్లి మండలానికి వెళ్లాడు. పనిలో భాగంగా ప్రమాదం జరిగి మరణించాడు. అలాగే గంగాపూర్ గ్రామానికి చెందిన లచ్చన్న, శ్రీనివాస్, బాబురావులకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే విశ్వనాథ కుటుంబీకులు, గ్రామస్తులు బయల్దేరి వెళ్లారు.
 
 
     ఉన్న ఊరు వదిలి.. అసువులు భాసి...
 బెజ్జూర్ : ఉన్న ఊరిలో పని దొరకక కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితుల్లో పొట్టచేత పట్టుకొని బతుకు కోసం పట్టణానికి వలస వెళ్లిన కూలీలకు చివరకు వారి పనే ప్రమాదానికి గురి చేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. బెజ్జూర్ గ్రామానికి చెందిన గౌతురే మల్లేశ్(18) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వేసవి సెలవుల్లో పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. అలా దండేపల్లికి కూలీ పనికని పోరుు ప్రమాదంలో అసువులు బాసాడు. మల్లేశ్ తన తల్లిదండ్రులు గోవారు, లక్ష్మిలకు నాలుగో సంతానం. కాగా, ఇదే గ్రామానికి చెందిన పెద్దల పోశం(45) ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఈయన భార్య బుచ్చక్క మృతిచెందింది. ఇప్పుడు పోశం కూడా మృతిచెందడంతో వారి కొడుకు శ్రీకాంత్ అనాథగా మిగిలాడు. దీంతో బెజ్జూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామంలో ఇద్దరు ఇలా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement