అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Sat, Nov 28 2015 7:13 PM

The farmer commits suicide

అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ తీగను పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలో పులుసుమామిడి గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలు.. గ్రామానికి చెందిన కేశపల్లి గోపాల్‌రెడ్డి(50), రత్నమ్మ దంపతులు. వీరికి సంతానం స్వప్న, సందీప్‌రెడ్డి ఉన్నారు. గోపాల్‌రెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం కూతురు వివాహం కోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు. కుమారుడు సందీప్‌రెడ్డి చదువు కోసం కూడా కొంతమేర రుణం తీసుకున్నాడు.

వర్షాభావ పరిస్థితులతో మూడేళ్లుగా సరిగా పంటలు పండడం లేదు. ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తిపంట చేతికి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు.  15 రోజులుగా సరిగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిసున్నాడు. అప్పటి నుంచి భార్య రత్నమ్మ గోపాల్‌రెడ్డిని కనిపెట్టుకుంటూ ఉంది.

శనివారం ఉదయం 6 గంటలకు రైతు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పక్క పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగను చేతితో పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వికారాబాద్‌లోని గొల్కోండ బ్యాంక్‌లో రూ. 23 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ. 3 లక్షల అప్పు ఉందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement