
టీడీపీ ‘బస్సు’లో మిగిలే దెవరు?
తెలుగుదేశం ‘బస్సు’లో సీట్లు ఖాళీ అవుతున్నాయి! తెలుగు తమ్ముళ్లంతా ‘కారె’క్కడానికే పోటీపడుతున్నారు. తెలంగాణ లో తిరగలేమని పేర్కొంటూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు గురువారమే
బస్సు యాత్రకు మరో ముగ్గురు ఎమ్మెల్యేల డుమ్మా!
టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ధర్మారెడ్డి ప్రకటన
ఏడుగురు ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నట్లు వెల్లడి
రైతు సమస్యలు గాలికొదిలి రాజకీయాలా?
సీఎం కేసీఆర్‌పై ఎల్. రమణ, ఎర్రబెల్లి నిప్పులు
హైదరాబాద్: తెలుగుదేశం ‘బస్సు’లో సీట్లు ఖాళీ అవుతున్నాయి! తెలుగు తమ్ముళ్లంతా ‘కారె’క్కడానికే పోటీపడుతున్నారు. తెలంగాణ లో తిరగలేమని పేర్కొంటూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు గురువారమే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించగా.. మరో ముగ్గురు కూడా శుక్రవారం అదే బాట పట్టారు. వీరంతా లేకుండానే టీడీపీ నేతల బస్సు బయలుదేరింది. టీటీడీపీ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి మొదలైంది. నల్లగొండ జిల్లాలో సాగిన ఈ యాత్రలో తెలంగాణలోని తమ నేతలంతా హాజరవుతారని పార్టీ ప్రకటించింది. కానీ టీడీపీకి చెందిన మొత్తం 15 మంది శాసనసభ్యు ల్లో కేవలం 10 మంది మాత్రమే నల్గొండ వెళ్లా రు. తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం) టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించి టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆర్. కృష్ణయ్య(ఎల్‌బీనగర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(ఇబ్రహీం పట్నం), ధర్మారెడ్డి(పరకాల) కూడా శుక్రవారం నాటి బస్సుయాత్రకు గైర్హాజరయ్యారు. మరోవైపు నియోజకవర్గ కార్యకర్తలతో వరంగల్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ధర్మారెడ్డి.. తాను త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈయన గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తలసాని బృందంలో ఉన్నా, టీడీపీ నేతల ఒత్తిడి మేరకు చంద్రబాబుతో జరిగిన సమావేశానికి హాజరై టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. చివరికి కారె క్కేందుకే మొగ్గుచూపారు. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం లాంఛనమే. మరో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు పార్టీ మారే ఉద్దేశ్యం గాని, టీడీపీలో కొనసాగడం గానీ ఇష్టం లేదు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బీసీల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీలోకి వచ్చిన తన కు సరైన గుర్తింపు రాలేదని భావిస్తున్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలన్న ఆలోచనతో ఉన్నారు.
బస్సులో మిగిలేదెవరు?
బస్సు యాత్ర 12వ తేదీ వరకు సాగుతుంది. శని, ఆది వారాల్లో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతు సమస్యలు తెలుసుకుంటూ బస్సుయాత్ర నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ చెబుతున్నారు. వరంగల్‌లో బస్సుయాత్ర మొదలుకావడానికి ముందే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి పార్టీ నుంచి తప్పుకొన్నారు. అంతేకాదు, ఏడుగురు ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నట్లు ఆయన చెప్పడం చర్చనీయాం శమైంది. అంటే ప్రస్తుతం బస్సుయాత్రలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో మరో ముగ్గురికి తక్కువ కాకుండా గులాబీ గూటికి చేరడం ఖాయమేనని అర్థమవుతోంది. నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో భారీ సభ ఏర్పాటు చేసి టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. అది కూడా ఈ వారంలోనే ఉండొచ్చని తెలుస్తోంది.
కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: టీడీపీ
తెలంగాణలో వర్షాలు లేక, కరెంటు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తున్నారని టీటీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాము రైతుల వద్దకు వెళుతున్నామని తెలియగానే కేసీఆర్‌కు చెమటలు పట్టాయని, అందుకే తమ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే పనికి ఒడిగట్టారని మండిపడ్డారు. కరెంటు విషయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిబుచ్చుకునేందుకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును తిట్టే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. బస్సుయాత్ర ద్వారా ప్రజలను కదిలిస్తామన్నారు. కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, పార్టీ తెలంగాణ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, జి. సాయన్న, మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.