పంచాయతీ భవనం చూపించి బిల్లు తీసుకున్నారు! | The building was in debt to the bill! | Sakshi
Sakshi News home page

పంచాయతీ భవనం చూపించి బిల్లు తీసుకున్నారు!

Feb 26 2015 2:52 AM | Updated on Mar 28 2018 11:11 AM

తవ్విన కొద్ది ‘ఇందిరమ్మ’ ఇళ్ల బాగోతం బయటపడుతోంది. అక్రమార్కులు ఏకంగా బషీరాబాద్ గ్రామ పంచాయతీ భవనాన్ని చూపించి బిల్లును తీసుకున్నారు.

బషీరాబాద్: తవ్విన కొద్ది ‘ఇందిరమ్మ’ ఇళ్ల బాగోతం బయటపడుతోంది. అక్రమార్కులు ఏకంగా బషీరాబాద్ గ్రామ పంచాయతీ భవనాన్ని చూపించి బిల్లును తీసుకున్నారు. బుధవారం సీబీ సీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్సై వేణుమాధవ్, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి బషీరాబాద్‌లో విచారణ జరిపారు. పంచాయతీ భవనంలో రిటైర్ బ్యాంకు ఉద్యోగి కమలమ్మ ఉంటోంది. ఆమె పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు ఉండటంతో అధికారులు కమలమ్మ ఉండే పంచాయతీ భవనానికి వెళ్లారు.

తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన విషయం తెలియదని ఆమె తెలిపింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. గోసాయి కాలనీలో పాతకాలం నాడు నాపరాతి ముక్కలతో నిర్మించిన ఇంటికి బిల్లు చెల్లించారని అధికారుల విచారణలో తేలింది. శిథిలావస్థకు చేరిన ఇం టికి సైతం అధికారులు బిల్లు చెల్లించారు.పంచాయతీ పరిధిలోని నవాంద్గి గ్రామంలో 4 పాత ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఓ ఇంటి అడ్రస్ లభించలేదు.బషీరాబాద్ పంచాయతీ పరిధిలోని సీబీ సీఐడీ అధికారుల ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు 223 ఇళ్లను పరిశీలించేందుకు వచ్చారు.

అందులో 10 ఇళ్ల అడ్రస్ దొరకలేదు. ఇప్పటికీ అడ్రస్ లేని ఇళ్ల సంఖ్య 92కు చేరింది. ఆర్‌అండ్‌బీ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు తెలిపారు. ఇళ్ల అడ్రస్ లేకుండా బిల్లులు తీసుకున్న వారి వివరాలు సేకరించేందుకు తమ సిబ్బంది బషీరాబాద్‌లోనే ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని సీబీ సీడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement