'టెన్‌'షన్ | Tenth class students to tension about changes in syllabus | Sakshi
Sakshi News home page

'టెన్‌'షన్

Published Wed, Feb 11 2015 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

'టెన్‌'షన్

'టెన్‌'షన్

చూస్తుండగానే జనవరి వెళ్లిపోయింది. ఫిబ్రవరి కూడా సగం గడుస్తోంది.

 మారిన సిలబస్‌తో ‘పది’ విద్యార్థుల కుస్తీ
 తదనుగుణంగా బోధన కరువు
 తూ..తూ మంత్రంగా ప్రాజెక్టు వర్క్
 వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
 సాక్షి విజిట్‌లో వెల్లడైన పలు అంశాలు  
       
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చూస్తుండగానే జనవరి వెళ్లిపోయింది. ఫిబ్రవరి కూడా సగం గడుస్తోంది. మార్చి 25వ తేదీ దగ్గరకు వస్తోందంటేనే జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి, సామర్థ్యాల ఆధారంగా, విషయ అవగాహనతో విద్యార్థులు పరీక్షలు రాయాలని ప్రవేశపెట్టిన నూతన సిలబస్‌తో విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం ఆశాజనకంగా ఉన్నా...
 
 మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రం తూతూ  మంత్రంగానే బోధన జరగుతోందనే విమర్శలు వస్తున్నాయి. నూతన సిలబస్‌కు అనుగుణంగా బోధించడం, ప్రాజెక్టుల నిర్వహణ, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు అప్పగించడంలో పలువురు ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ‘సాక్షి’ విజిట్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ప్రతిభ, వారికి జరుగుతున్న బోధనను  పరిశీలించింది.
 
పూర్తికాని సిలబస్‌తో కష్టాలు...
జిల్లాలో 341 ప్రభుత్వ, 384 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 37,127 మంది విద్యార్థులు వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. గతంలో ఉన్న సిలబస్ ప్రకారం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రతి పాఠ్యాంశాల్లో ఉన్న కీలక అంశాలు, ప్రశ్నలు, ఖాళీలు పూరించడం మొదలైన అంశాలపై పునశ్చరణ నిర్వహించే వారు. ప్రతి విద్యార్థి ప్రతిభను అంచనా వేసి వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు.
 
ఈ క్రమంలోనే డీ- గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారికి కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకొచ్చేవారు. ఇదంతా డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి చేసేవారు. అయితే మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏ నెల సిలబస్ ఆ నెల పూర్తి చేస్తే అనుకూలంగా ఉండేది. కానీ వైరా, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు మండలాలతోపాటు పలు పాఠశాలల్లో ఇప్పటి వరకు జనవరి సిలబస్ కూడా పూర్తికాలేదు. దీంతో పరీక్షలు ముంచుకొస్తుంటే తూతూ మంత్రంగానే బోధించే ప్రమాదం ఉంది.  ఈ పరిస్థితిలో కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమే.
 
 ప్రాజెక్టు పనుల కోసం పరుగులు..
 మారిన సిలబస్ ప్రకారం పాఠ్యాంశం పూర్తి కాగానే విద్యార్థికి ప్రాజెక్టు వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని విద్యార్థి చేయాలంటే ప్రముఖల జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఇతర ముఖ్య అంశాలను జోడించి రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం పట్టణంలోని విద్యార్థులు సమీపంలోని నెట్ సెంటర్లకు వెళ్లి సంబంధిత అంశాలను డౌన్‌లోడ్ చేసుకుంటుండగా.. మారుమూల ప్రాంతాల విద్యార్థులు నెట్ సౌకర్యం అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల్లో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు బోధకులు లేక మూలన వేశారు. దీంతో నూతన విధానానికి అనుగుణంగా విద్యార్థులు చదువుకోవడం కష్టంగా మారింది. దీంతో ప్రాజెక్టు వర్క్ చేయలేని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌కు వేసే 20 మార్కులను కూడా ఉపాధ్యాయులు సుమారుగా విద్యార్థి తెలివి అంచనాను బట్టే వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత..
 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొతర వెంటాడుతోంది. పదవ తరగతికి బోధించి అన్ని సబ్జెక్టులకు కలిపి స్కూల్ అసిసెంట్లు మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఐదు వందల మేరకు ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లోనే అధికంగా ఉండటం విశేషం. దీంతో పదో తరగతి బోధన ఇబ్బందిగా మారుతోంది. ఈ విషయంపై గతంలో 60 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేసినా వారు సక్రమంగా వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాలేరు నియోజకవర్గంలో కామంచికల్‌లో లెక్కల పోస్టు, గుదిమళ్లలో సైన్స్, సోషల్ పోస్టులు, గోళ్లపాడు పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్‌కు అసలు ఉపాధ్యాయులే లేరు. ఏదో సిలబస్ పూర్తి కావడం కోసం హడావుడిగా వేరే ఉపాధ్యాయులతో బోధింపచేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. వైరా జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ సబ్జెక్టులకు పూర్తి స్థాయిలో ఉపాద్యాయులు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 
 ఒకే పరీక్షా విధానంతో తంటాలే..  
 ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులే ఎక్కువ. అందులోనూ  గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ మీడియాలకు ఒకే పరీక్షా విధానం అమలు చేస్తోంది. దీనివల్ల ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సొంతంగా ఆలోచించి రాయటం కష్టంగా మారింది. సాంఘికశాస్త్రంలో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులకు మాత్రమే గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు.
 
 గణితంలో కొన్ని అభ్యాసాలు, లెక్కలు చే స్తే పరీక్షల్లో గతంలో అవే తరచుగా వచ్చేవి. ప్రస్తుత విధానంలో మాదిరి లెక్కలను సాధించటం ద్వారా మార్కులు పొందాల్సి ఉంది. ప్రాజెక్టులు ఇవ్వటం, నూతన సమస్యలను తయారు చేయటం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించవచ్చని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. నూతన సిలబస్‌పై కుస్తీ పడుతూనే.. మొదటి సారిగా కొత్త పరీక్షా విధానానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement