ప్రగతి టెన్షన్‌

Tension In Khammam TRS Leaders - Sakshi

సెప్టెంబర్‌ 2న జనసమీకరణకు సమావేశాలు

రైతు సమన్వయ సమితులతో ప్రత్యేక మీటింగులు

టికెట్ల ప్రకటన నేపథ్యంలో నేతల్లో ఉత్కంఠ

ఇప్పటికే పలు సర్వేల ఆధారంగా మార్కుల గ్రేడింగ్‌

సాక్షి, కొత్తగూడెం : ఇప్పటికే ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ఇది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 2వ తేదీన ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో పార్టీ నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. ఈ సభకు జనసమీకరణ అత్యంత ప్రధానం కావడంతో నాయకులు, ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు టికెట్ల ప్రకటన అని చెప్పడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. అయితే జనసమీకరణ అంశాన్ని పార్టీ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేశారు.  ప్రతి నియోజకవర్గంలో విడతలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ సమావేశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నారు. జనసమీకరణకు పార్టీ నాయకత్వం నియోజకవర్గాల వారీగా టార్గెట్‌ పెట్టడంతో అందుకు తగినట్లుగా జనసమీకరణ, వారిని హైదరాబాద్‌ తరలించేందుకు వాహనాలు సమకూర్చడంలో హడావిడి నెలకొంది. జనసమీకరణ విషయంలో ప్రత్యేక పరిశీలన ఉంటుందని తెలుస్తుండడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, టికెట్ల ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది. జిల్లాలోని భద్రాచలం మినహా మిగిలిన ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలంతా సిట్టింగ్‌లే. ప్రతి నియోజకవర్గంలోటికెట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వివిధ సర్వేలు, పనితీరుకు మార్కులు ఇచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో దడ మొదలైంది. 

రాజుకున్న ఎన్నికల వేడి..  

ముందస్తు ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించడంతో పాటు అసెంబ్లీ రద్దు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభ ఎన్నికల శంఖారావ సభ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది.  ఈ సభలో కొన్ని స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కేసీఆర్‌ ప్రకటించడంతో ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామనే ప్రకటనతో పార్టీలో అంతర్గత టికెట్ల పోరు మరింతగా  పెరుగుతోంది. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లోనూ దడ మొదలైంది. ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలలో ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్‌ పలు సర్వేలు నిర్వహించారు.

వివిధ రకాల నివేదికలు తెప్పించుకున్నారు. వారి పనితీరుకు మార్కులు, గ్రేడింగ్‌ ఇచ్చారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని పలువురు ఎమ్మెల్యేలకు సూచించారు. ఇందులో భద్రాద్రి జిల్లా శాసనసభ్యులు సైతం ఉన్నారు. పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివేదికలు సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో సిట్టింగ్‌లతో పాటు పలువురు ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది.

మరోవైపు జనసమీకరణ అంశం సైతం ప్రధానమంటూ వార్తలు వినపడుతుండడంతో అందుకోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి చెక్కులు, రైతుబీమా ఇవ్వడంతో సభకు రైతులను భారీగా సమీకరించే లక్ష్యంతో సమన్వయ సమితుల సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. తరువాత మండల పార్టీ, స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశాలు నిర్వహిస్తున్నారు.  

సోషల్‌ మీడియా వార్తలతో గందరగోళం.. 

ప్రగతి నివేదిక సభ నేపథ్యంలో ప్రకటించనున్న అభ్యర్ధులు వీరేనంటూ సోషల్‌ మీడియాలో వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికివారు తమకు తోచినట్లుగా పంపుతున్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ గందరగోళం నెలకొంది. ఎక్కడ చూసినా టికెట్లకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top