దళిత భక్తుడికి ఆలయప్రవేశం

Temple entrance to Dalit devotee - Sakshi

జియాగూడలో ఘనంగా మునివాహన సేవా మహోత్సవం 

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్‌ భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు.

అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్‌ మాట్లాడుతూ 2,700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రతిగుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతోపాటు వారిని అన్ని విధాల జాగృతిపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి కారెంపుడి లక్ష్మీనరసింహా మాట్లాడుతూ నగరంలో మొదటిసారి చేపట్టిన మునివాహన సేవా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆధిత్య పరాశ్రీ మాట్లాడుతూ దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుపావై కోకిల మంజులశ్రీ, కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ వంశీతిలక్, రంగనాథస్వామి దేవాలయ ఫౌండర్‌ ట్రస్టీ ఎస్టీ చార్యులు, శేషాచార్యులు, సుందర రాజన్, రాధామనోహర్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top