దళిత కుటుంబంపై చేయి చేసుకుంటున్న టీడీపీ నేత సీసీ నాయుడు
దళితుడిపై అధికార పార్టీనేత దాడి
దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం
తహసీల్దార్‌కు బాధితుల ఫిర్యాదు
రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదలు, దళితులపై దౌర్జన్యాలకు తెగబడుతూ వారి భూములను లాక్కుంటున్నారు. ఇదేమని అడిగిన వారిపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. అధికారులూ టీడీపీ నేతలకే వంత పాడుతున్నారు. న్యాయం చేయండని బాధితులు మొత్తుకుంటున్నా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
బాలాయపల్లి (సైదాపురం): ‘ఇది మా ఊరు. ఇదంతా మా భూమి. నువ్వు ఎవడ్రా మా ఊరి పొలం చేయడానికి’ అంటూ టీడీపీ నేత సీసీ నాయుడు ఓ దళిత కుటుంబంపై దాడికి తెగబడి.. ఆ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించే యత్నం చేశాడు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో అక్కసముద్రం పరిధిలోని ప్రభుత్వ భూమిని యాచవరం దళితవాడకు చెందిన దళితులు 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిపై వెంగమాంబపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత సీసీ నాయుడు కన్ను పడింది.
ఆదివారం జేసీబీ, బుల్‌డోజర్లతో వచ్చి టీడీపీ నేత ఆ భూమిని దున్నే ప్రయత్నం చేశాడు. దీంతో దళితుడైన చిరంజీవి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీసీ నాయుడు ‘నీకు భూమి ఎక్కడ ఉంది. మా ఊళ్లో పొలాన్ని మీరెలా సాగు చేస్తారు’ అంటూ వారిపై చేయి చేసుకున్నాడు. ఈ పొలానికి సంబం«ధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమిని వదిలేయాలని దళిత దంపతులు ప్రాధేయపడినా వినకుండా ఆ దంపతులపై దాడికి యతి్నంచాడు. దీంతో దంపతులిద్దరూ బుల్డోజర్‌కు అడ్డంగా పడుకుని పనులను అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నా సీసీ నాయుడును అడ్డుకోలేదని స్థానిక దళితులు ఆవేదనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై బాధితులు బుధవారం బాలాయపల్లి తహశీల్దార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ నేత సీసీ నాయుడుపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈ ఘటనపై టీడీపీ నేత, యాచవరం పీఏసీఎస్ అధ్యక్షుడు సీసీ నాయుడుపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోపీ తెలిపారు. తమ భూమిని ఆక్రమించేందుకు సీసీ నాయుడు ప్రయత్రించడమే కాకుండా తమను అసభ్య పదజాలంతో దూషించినట్టు వరికూటి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ చెప్పారు.


