ప్రతి పల్లెలో సీసీ నిఘా

Telangana Villages Will Be In CCTV Surveillance Says DGP Mahender Reddy - Sakshi

కమ్యూనిటీ, నేను సైతం ప్రాజెక్టులతో.. పోలీసు శాఖ కార్యాచరణ

ఎక్కడికక్కడ కమాండ్‌ సెంటర్లు రాజధానికి జిల్లా సెంటర్ల అనుసంధానం: డీజీపీ

సీసీ కెమెరాలు, విశిష్టతపై అధికారులకు అవగాహన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టులను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు కింద జనసంచార, రద్దీ ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులతో స్వచ్ఛంద సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నేను సైతం ప్రాజెక్టు కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వ్యాపారులు, కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు, వివిధ సంఘాలు నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ సీసీటీవీల వీడియో ఫుటేజీ 30 రోజుల పాటు ఉంటుందని, నేను సైతం కింద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫీడ్‌ యజమాని నిర్వహణపై ఆధారపడి ఉంటుందని డీజీపీ వివరించారు.  

జీహెచ్‌ఎంసీలో 10 లక్షల కెమెరాలు
గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ సీసీటీవీలు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానిస్తామని డీజీపీ చెప్పారు. సర్కిల్, డివిజన్, జిల్లా స్థాయి కమాండ్‌ సెంటర్లకు వాటిని అనుసంధానిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కమాండ్‌ సెంటర్లను రాజధానిలో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానిస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్‌లో అనేక సంచలనాత్మక కేసులను 24–40 గంటల్లోనే ఛేదించామని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ పరిధిలో 2014 నుంచి 2017 మధ్య 32 శాతం నేరాల తగ్గుదల కనిపించిందని.. సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 లక్షలు, మిగతా ప్రాంతాల్లో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసుకునే కెమెరాలను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూపొందించిన మార్గదర్శాకాల ద్వారా కొనుగోలు చేయాలని.. నెట్‌వర్క్‌ వ్య వస్థ, హెచ్‌డీ క్వాలిటీ అంశాలను పాటించాలని డీజీపీ చెప్పారు. మార్గదర్శకాల కాపీ లను ఎస్పీలు, కమిషనర్లకు అందించారు. తద్వారా సీసీ ఫుటేజీ క్వాలిటీ బాగుంటుందని, నిందితులు, అనుమానితుల గుర్తింపు సులభమవుతుందని చెప్పారు.  

పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి: నాయిని
నేను సైతం ప్రాజెక్టుకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసులు రూపొందించిన షార్ట్‌ ఫిలిమ్‌ను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. టెక్నాలజీతో నేరాల నియంత్రణ చేయొచ్చని హైదరాబాద్‌ పోలీసులు రుజువు చేశారని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెళ్తే నేరాల నియంత్రణ సులభమవుతుందన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని, పీపుల్‌ ఫ్రెండ్లీగా పోలీసులు ఉండాలాని నాయిని ఆకాక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top