
ఆ పోలీస్‌స్టేషన్లలో సీసీల కొరత
ఉన్నవి స్టేషన్ మొత్తం కవర్ చేయడం లేదు
హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ కమిషనర్ ఎమ్మార్కే చక్రవర్తి
ఫుటేజీ ఎక్కడ స్టోర్ చేస్తారో తెలుసుకుని చెబుతానన్న స్పెషల్ జీపీ
విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అడ్వకేట్ కమిషనర్ ఎమ్మార్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. ఉన్న కెమెరాలూ స్టేషన్ మొత్తాన్ని కవర్ చేయడం లేదని వివరించారు. రాష్ట్రంలోని అన్నీ పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ఈ కేసులో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పణకు ధర్మాసనం అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తిని నియమించింది. మంగళవారం తాజా విచారణ సందర్భంగా అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తి తన నివేదికను కోర్టుకు సమర్పించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుంటూరు జిల్లాలోని అమరావతి, తుళ్లూరు, అరండల్‌పేట, నల్లపాడు పోలీస్‌స్టేషన్లలో సగటున 10 సీసీ కెమెరాలు ఉన్నాయని, మంగళగిరిలో మాత్రం 11 ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇవి ఎంత మాత్రం సరిపోవని వివరించారు.
రెండు ఫ్లోర్లు ఉన్న పోలీస్‌స్టేషన్లలో కింది ఫ్లోర్‌లో మాత్రమే సీసీ టీవీలు ఏర్పాటు చేశారని, మరో ఫ్లోర్‌లో వాటిని అమర్చలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీసీ టీవీల లభ్యత విషయంలో ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లకు అధికారాలు లేవని, డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి ఫుటేజీ పొందేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో సీసీటీవీ ఫుటేజీ కావాలంటే ఎస్పీ కార్యాలయం నుంచి తెప్పించుకోవాల్సి వస్తోందన్నారు.
అత్యవసరమైతే పాస్‌వర్డ్ ఇస్తారని, ఫుటేజీ తీసుకున్న తరువాత ఆ పాస్‌వర్డ్‌ను మార్చేస్తారని పెనమలూరు ఎస్‌హెచ్‌వో తనకు చెప్పారని అడ్వొకేట్ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. మిగిలిన స్టేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ లేరని, దీంతో వీడియో రికారి్డంగ్, దాని లభ్యత, డీవీఆర్‌ల నుంచి ఫుటేజీ సేకరణ వంటి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయానని చక్రవర్తి తెలిపారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, డీవీఆర్‌లలో రికార్డ్ అయిన ఫుటేజీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారో తెలుసుకుని చెబుతానన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.