చివరకు మిగిలేది ?!

Telangana TDP Leaders Join In BJP - Sakshi

‘సైకిల్‌’ దిగి ‘కమలం’ గూటికి చేరుతున్న తమ్ముళ్లు

మూడు జిల్లాల టీడీపీ అధ్యక్షులతో పాటు పలువురు సీనియర్‌ నేతలు జంప్‌

నేడు బీజేపీ జాతీయనేత అమిత్‌షా సమక్షాన బీజేపీలో చేరిక

ఇప్పటికే పార్టీ మారిన పలువురు సీనియర్లు.. దయనీయ స్థితిలో టీడీపీ

పార్టీలో మిగిలిన సీనియర్‌ నేత ప్రకాష్‌రెడ్డి ఒక్కరే..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ(టీటీడీపీ) దుకాణం ఇక మూతపడినట్లే. పలువురు తెలుగు తమ్ముళ్లు సైకిల్‌ దిగేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలో టీడీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గిపోగా.. శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మరీ చిక్కిశల్యమైంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా భవిష్యత్‌ ఉన్న పలువురు నేతలు ఆ పార్టీలో ఉంటే మనుగడ సాధించలేమన్న ఉద్దేశంతో మారుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, జనగామ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, పలువురు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆదివారం కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత సీనియర్లు ఒక్కరొక్కరుగా టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీలో చివరకు ఎవరు మిగులుతారన్న చర్చ మొదలైంది.

బాటలు వేసిన కడియం.. భారీ షాక్‌ ఇచ్చిన ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న కడియం శ్రీహరి టీడీపీ నుంచి బయటపడ్డారు. 2013 మే 11న ఆ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు వైఖరిపై విసిగి వేసారిన ఎర్రబెల్లి దయాకర్‌రావు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 2015 జులై 21న టీఆర్‌ఎస్‌లో చేరారు. ఏకంగా ఆయన టీడీఎల్‌పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీకి కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ నుంచి ఇతర పార్టీలకు మొదలైన వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆయన వెంట ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీనియర్‌ నాయకురాలు ధనసరి అనసూయ(సీతక్క), మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి నడిచారు. ఫలితంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి వరంగల్‌ వరుస వలసలతో దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఒక్క వరంగల్‌ పశ్చిమ నుంచే పోటీ చేసిన ఆ పార్టీ ఓటమి పాలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సరేసరి కాగా.. పంచాయతీరాజ్‌ ఎన్నికలతో పాటు పార్టీ రహితంగా జరిగిన గ్రా మ పంచాయతీల ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం ఉనికిని చాటలేకపోయింది.

పార్టీలో మిగిలిన సీనియర్‌ ప్రకాశ్‌రెడ్డి
నాయకుడు లేని నావలా తయారైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నర్సంపేట నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆయన కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగినా.. స్పష్టత లేదు. అయితే, దీనిని ఆయన ప్రచారంగానే కొట్టిపారేస్తుండగా... పార్టీ సీనియర్‌గా ఆయనొక్కరే టీడీపీకి ఇప్పుడు పెద్దదిక్కుగా మిగిలినట్లయింది. ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభలో పలువురు టీడీపీ సీనియర్లు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. కాగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చాడ రఘునాథరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్‌ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వారి అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు వీరంతా కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేసి లేఖను అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలో ఆదివారం జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షాన ఆ పార్టీలో చేరనున్నామని కూడా వారు ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top