ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా

Telangana Students Toppers In AP EAMCET - Sakshi

ఇంజనీరింగ్‌లో టాప్‌–10లో ఆరుగురు 

అగ్రి, మెడిసిన్‌లో ఇద్దరు 

26 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం

సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌–10లో ఆరుగురు రాష్ట్ర విద్యార్థులే ఉన్నారు. గట్టు మైత్రేయ ఇంజనీరింగ్‌లో రెండో ర్యాంకు సాధించాడు. అగ్రి, మెడికల్‌ విభాగంలోనూ టాప్‌–10లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఏపీ ఎంసెట్‌–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఇంజనీరింగ్‌లో 25,410 మంది పరీక్ష రాయగా 21,750 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రి మెడికల్‌ విభాగంలో 10,359 మంది పరీక్ష రాయగా 9,514 మంది ఉతీర్ణులయ్యారు.

అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఈఏఎంసీఈటీ’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా టాప్‌ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ నెల 26 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా చెప్పారు. 

మైత్రేయకు ఫస్ట్‌ ర్యాంకు రావాల్సి ఉన్నా.. 
ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్‌లో మార్కులను నార్మలైజేషన్‌ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్‌ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్‌ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీంతో ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్‌ మార్కులతో కలిపి కంబైన్డ్‌ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్‌ సూరజ్‌ కృష్ణకు ఎంసెట్‌ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్‌ స్కోర్‌ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్‌.. గట్టు మైత్రేయకు ఎంసెట్‌ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్‌ స్కోర్‌ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్‌ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు. 

=== 
పరిశ్రమను స్థాపించడమే లక్ష్యం: విష్ణు మనోజ్ఞ 
ర్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్‌లో మంచి కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 
=== 
పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం: గోసుల వినాయక శ్రీవర్థన్‌ 
మాది సంగారెడ్డి జిల్లా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం. 
=== 
సైంటిస్ట్‌ను కావడమే లక్ష్యం: బసవరాజు జిన్షు 
సైంటిస్ట్‌ కావాలన్నది నా లక్ష్యం. ఇంటర్నేషనల్‌ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను. ఇండియా నుంచి ఏటా 25 మంది ఎంపిక చేస్తుండగా, దీనిలో నేను ఒకటిని 
=== 
సివిల్‌ సర్వీసే లక్ష్యం: అయ్యపు వెంకటపాణి వంశీనాథ్‌ 
ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరుతాను. భవిష్యత్తులో సివిల్స్‌ సర్వీస్‌లో చేరి సమాజానికి సేవ చేయాలన్నదే లక్ష్యం. 
=== 
సర్జన్‌గా సేవలందిస్తా: జయసూర్య 
అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహమే నేను ఈ ర్యాంకు సాధించడానికి ప్రధాన కారణం. భవిష్యత్‌లో సర్జన్‌గా సేవలందిస్తా. 
=== 
ముంబై ఐఐటీలో చదువుతా
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌ సాధించి ముంబై ఐఐటీలో చేరాలనుకుంటున్నా. కుటుంబసభ్యుల సహకారంతో ప్రణాళికబద్ధంగా చదవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది.     – గట్టు మైత్రేయ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top