బస్సులో ఉన్నప్పుడు వైరస్‌ లేదు! 

Telangana state First Kovid Victim Has No Virus Symptoms In Bus - Sakshi

కోవిడ్‌ బాధిత యువకుడి కేసులో వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారణ 

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి కోవిడ్‌ బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చినప్పుడు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తేల్చాయి. అక్కడి నుంచి వచ్చాకే జ్వరం ప్రారంభమైందని తెలిపాయి. ఇక హైదరాబాద్‌ వచ్చాక తన కుటుంబంలో 13 మంది సభ్యులతో కలిసి ఉన్నాడని నిర్ధారించాయి. ఆయన బెంగళూరులోని గ్లోబల్‌ టెక్నాలజీ పార్క్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో అతడి కుటుంబం ఉంటోంది. ఆ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితోపాటు అపోలో ఆస్పత్రిలో అతడు కాంటాక్ట్‌ అయిన 50 మంది వైద్య సిబ్బందిని కూడా గుర్తించారు. మొత్తమ్మీద కుటుంబ సభ్యులతో కలిపి 88 మందిని అతడు కలుసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. వారిలో 45 మందిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు అతడితో కలిసి ఉన్నవారిలో 36 మందికి కోవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపించాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాడంటే? 

  • కోవిడ్‌ బాధితుడు ఫిబ్రవరి 15న బెంగళూరు నుంచి దుబాయ్‌ వెళ్లాడు.  
  • గతనెల 16 నుంచి 19 వరకు అక్కడే ఉన్నాడు. సింగపూర్‌కి చెందిన అతడి కంపెనీ ఉద్యోగితో కలిసి పనిచేశాడు. 
  • 20న తిరిగి బెంగళూరు వచ్చాడు.  
  • 20, 21 తేదీల్లో ఆఫీసుకు వెళ్లాడు.  
  • 21న హైదరాబాద్‌ బయలుదేరాడు.  
  • 22న ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నాడు. జ్వరం రావడంతో అపోలోలో పరీక్షలు చేయించుకున్నాడు.  
  • తర్వాత నాలుగైదు రోజులకు కోవిడ్‌ లక్షణాలు మొదలయ్యాయి.  
  • 27న సికింద్రాబాద్‌ అపోలోలో చేరి 29 వరకు చికిత్స చేయించుకున్నాడు. 
  • 27న అతడికి చెస్ట్‌ ఎక్స్‌రే చేశారు. అందులో బైలేటరల్‌ లోయర్‌ లోబ్‌ న్యుమోనియా అని విశ్లేషణ ఉంది.  
  • ఈనెల 1న గాంధీలో చేరాడు.  
  • సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్‌ అనుమానిత కేసుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేశారు. అర్థరాత్రి ఒంటిగంటకు మరో నమూనా తీసుకున్నారు.  
  • 2న ఉదయం 9 గంటలకు అతడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు.
  • పుణేకు పంపిన శాంపిల్స్‌లోనూ పాజిటివ్‌గా తేలడంతో తెలంగాణలో తొలి కోవిడ్‌ కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top