పల్లె పంచాయతీ

Telangana State Election Commission To Conduct Panchayat Polls - Sakshi

ఇక గ్రామపంచాయతీల ఎన్నికలపై కసరత్తు 

నేడు బీసీ ఓటర్ల ముసాయిదా విడుదల

ఈనెల 15న తుది జాబితా.. 

కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే నోటిఫికేషన్‌ విడుదల? 

సాక్షి, జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. దీనికి సంబంధించి ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.. ఆ వెంటనే పల్లె ‘పంచాయతీ’ మొదలుకానుంది. హైకోర్టు కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలను 2019 జనవరి 11వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ మేరకు అధికారులు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్లకు ఈనెల 5న ఆదేశాలు అందాయి. దీంతో వారు ఆదివారం ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

రిజర్వేషన్లపై నిరాశ 
గత ఆగస్టు 2వ తేదీ నాటికి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో అంతకు నెల ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక నోటిఫికేషన్‌ విడుదలే తరువాయి అనుకున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు జరగలేదు.

అయితే, బీసీ రిజర్వేషన్లను పెంచేది లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. అలాగే, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ అక్టోబర్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పనిసరి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు నవంబర్‌ మొదటి వారం నుంచే పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. 
 

నేడు ముసాయిదా.. 15న తుది జాబితా 
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారులు ఈనెల 5వ తేదీ నుంచి బీసీ ఓటర్ల చేపడుతున్నారు. ఇంటింటికీ తిరిగి బీసీ ఓటర్లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే శనివారం ముగిసింది. ఈ సర్వేకు సంబంధించి ముసాయిదా జాబితాను ఆదివారం వెల్లడించాల్సి ఉంది. ఈ జాబితాను అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అనంతరం ముసాయిదాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వీకరించి ఈనెల 12వ తేదీలోగా వాటిని పరిష్కరించాలి. ఇక ఈనెల 13, 14వ తేదీల్లో అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాపై గ్రామసభలు ఏర్పాటుచేసి 15న తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు. 

జిల్లాలో 7,45,659 మంది ఓటర్లు 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే  సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 11,18,823 మంది జనాభా ఉంది. ఇందులో ఎస్టీలు 1,26,851 మంది, ఎస్సీలు 1,86,914 మంది ఉండగా.. ఇతరుల జనాభా 8,05,058 గా వెల్లడించారు.

ఇక ఇందులో 7,45,659 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 3,74,026 మంది పురుషులు కాగా, 3,71,604 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక జిల్లాలో పాత పంచాయతీలు 468 ఉండగా.. కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడ్డాయి. మొత్తం 733 పంచాయతీలు కాగా.. ఇందులో 12 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.

దీంతో 721 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం పంచాయతీల్లో కలిపి 6,382 వార్డులకు గాను 6,366 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 6,364 పోలింగ్‌ స్టేషన్లను ఇప్పటికే ఎంపిక చేసిన అధికారులు మరో 18 స్టేషన్లను రిజర్వ్‌లో ఉంచారు. 

రెండు విడతలుగా ఎన్నికలు 
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో రెండు పంచాయతీ డివిజన్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ డివిజన్‌లో 14 మండలాలు, 441 పంచాయతీలు ఉండగా.. నారాయణపేట డివిజన్‌లో 11 మండలాలు, 280 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

ఎన్నికల నిర్వహణకు మొత్తం 4,685 బ్యాలెట్‌ బాక్సులు అవసరం కాగా.. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్‌లో గోదాంలో భద్రపరిచారు. ఈ బాక్సుల్లో 4,535 సరిగ్గానే ఉన్నాయని గుర్తించిన అధికారులు 150 బాక్సులకు అవసరమైన మరమ్మతు చేయించారు. ఇవేకాకుండా జిల్లాలో ఉన్న 3వేల బాక్సులకు మరమ్మతులు చేయించి పోలింగ్‌కు సిద్ధం చేశారు.

 
రిజర్వేషన్లపై కసరత్తు 
గ్రామపంచాయతీ ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం అధికారులు గ్రామపంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. 
 

ప్రభుత్వం ఏర్పడగానే.. 
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. 11వ తేదీన ఓట్లు లెక్కించాక కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం.. రిజర్వేషన్లు పెంపును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎదురుకానుంది. 

ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.. 
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు రిజర్వేషన్లను ప్రకటిస్తాం. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరగానే ఈ అంశంపై ఆదేశాలు వెలువడు అవకాశముంది. 
– వెంకటేశ్వర్లు, డీపీఓ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top