తెలంగాణ ప్రజల పార్టీ ఆవిర్భావం | Telangana Peoples Party Formation | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజల పార్టీ ఆవిర్భావం

Mar 5 2018 12:31 AM | Updated on Mar 5 2018 12:31 AM

Telangana Peoples Party Formation - Sakshi

పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రకుమార్‌ తదితరులు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ యవనికపై మరో ప్రాంతీయపార్టీ పురుడు పోసుకుంది. బహుజనులకు రాజ్యాధికారం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఏర్పడింది. ఆదివారం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రజల పార్టీ(టీపీపీ) ఆవిర్భావ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ ‘మాది దొరల పార్టీ కాదు, కుట్రలు, కుతంత్రాలు ఉండవు, ఇది బహుజనుల పార్టీ’అని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తమ పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, రైతుల ఆత్మహత్యలు ఉండవని, అవినీతి అక్రమాలు జరగవని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. కుడిచేతితో నోటిఫికేషన్లు ఇచ్చి ఎడమచేతితో హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని అన్నారు. సమాజంలో 50 శాతం ఉన్న మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీని విస్మరించారని అన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరమైందని అన్నారు. అన్ని ఉద్యోగాలు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమిస్తున్నారని, చివరకు మంత్రి పదవులను కూడా ఔట్‌ సోర్సింగ్‌లో నియమిస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఎంబీసీలకు రూ. 1000 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పేదల ఆకాంక్ష నెరవేర్చడానికే తాము కొత్త పార్టీని పెట్టామని చెప్పారు. 

తెలంగాణ ప్రజల పార్టీ నూతన కార్యవర్గం... 
తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడిగా జస్టిస్‌ బి.చంద్రకుమార్, ఉపాధ్యక్షులుగా వేదవికాస్, సుతారి లచ్చన్న, ముప్పారపు ప్రకాశ్, మోహన్‌రాజ్, సెక్రటరీ జనరల్‌గా డాక్టర్‌ పీవీ రామనర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ సాంబశివగౌడ్, కోశాధికారిగా రఘు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా ఏలేశ్వరం వెంకటేశ్, జయరాజ్, భద్రయ్య, జాయింట్‌ సెక్రటరీగా సందీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. మహిళా విభాగం నాయకులుగా డాక్టర్‌ ఆత్మీయ నిర్మల, జి.స్వర్ణ, విద్యార్థి విభాగం నాయకుడిగా అంజి, యువజన విభాగం నేతగా సూరజ్‌గౌడ్, రైతు విభాగం నేతగా ఏసీ రెడ్డి, రామకృష్ణ, మైనార్టీ విభాగం నాయకుడిగా కేఏ రహమాన్, మీడియా విభాగం ఇన్‌చార్జిగా దేవరశెట్టి వేణుమాధవ్, సలహాదారులుగా ప్రొ.తిరుమలి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ప్రభాకర్, మురళీమనోహర్, న్యాయవాది రామరాజు, ప్రభాకరాచారి నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement