పోరు షురూ..

Telangana Panchayat Second Nominations Rangareddy - Sakshi

మెదక్‌ అర్బన్‌:  మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆదివారం పూర్తయింది. ఉపసంహరణ అనంతరం మొత్తం 154 సర్పంచ్‌ స్థానాలకు   321 మంది బరిలో నిలిచారు.  మొదటి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమై బుధవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు మండలాలు  అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాలు, పెద్దశంకరంపేట, పాపన్నపేట, హవేళిఘణాపూర్‌ పరిధిలోని 154 పంచాయతీలు, 1,364 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 21న పోలింగ్‌ జరగనుంది.  నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 32 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తేల్చిచెప్పారు.

సర్పంచ్‌ అభ్యర్థి స్థానాలకు 321, వార్డు సభ్యుల స్థానాలకు 1718 పోటీలో నిలిచారు.  పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.  మొదటి రోజైన సోమవారం సర్పంచ్‌ పదవులకు 110 నామినేషన్లు  రెండో రోజు  163 నామినేషన్లు, చివరి రోజు 610 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఆరు మండలాలకు గాను మూడు రోజుల్లో సర్పంచ్‌ స్థానాలకు గాను 883 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3,007 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. అత్యధికంగా 69 మంది హవేళిఘణాపూర్‌ మండలం నుంచి సర్పంచ్‌ బరిలో ఉన్నారు. కాగా రేగోడ్‌ మండలం నుంచి అత్యంత తక్కువగా 40 మంది పోటీలో నిలిచారు. అలాగే వార్డు సభ్యులకు పాపన్నపేట మండలం నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. టేక్మాల్‌ మండలం నుంచి తక్కువగా ఉన్నారు.

ఏకగ్రీవమైన సర్పంచ్‌ స్థానాలు ఇవే...పెద్దశంకరంపేట మండలం: 
మొత్తం 27 పంచాయతీలు ఉండగా వాటిలో ఐదు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి.  మాడ్చెట్‌పల్లి, కమలాపూర్, ఇసుకపాయల తండా, శివ్వాయిపల్లి, ఆరేపల్లి ఏకగ్రీవమయ్యాయి.  మండలంలోని పెద్దశంకరంపేట, లద్దారం, గొట్టిముక్కుల, రామోజీపల్లి, ఉత్తలూరు గ్రామాల నుంచి ముగ్గురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు.

టేక్మాల్‌ మండలం:
మండలంలో 29 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో ఐదు గ్రామాలు చెరువు ముందరి తండా, చంద్రు తండా, సంగ్యా తండా, హసన్‌ మహ్మద్‌పల్లి, మల్కాపూర్‌ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.

అల్లాదుర్గం మండలం:
మండలంలో 16 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా ఇందులో కేవలం రెండు పంచాయతీలు మాత్రమే ఏక్రగ్రీమవయ్యాయి. మాందాపూర్, సీతానగర్‌ సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
 
రేగోడ్‌ మండలం :
మండలంలో మొత్తం 18  పంచాయతీలున్నాయి. పెద్ద తండా పంచాయతీ సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవమయింది. మిగితా 17 గ్రామ పంచాయతీ స్థానాలకు 40 మంది సర్పంచ్‌ బరిలో ఉన్నారు.

హవేళిఘణాపూర్‌ మండలం:
మండంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో  ఏడు పంచాయతీలు కొత్తపల్లి, రాజ్‌పేట, తొగిట, సుల్తాన్‌పూర్, స్కూల్‌ తండా, చౌట్లపల్లి, లింగ్సాన్‌పల్లి తండాలు ఏకగ్రీవమయ్యాయి.  మిగితా 21 గ్రామపంచాయతీ స్థానాలకు 69 మంది సర్పంచ్‌ బరిలో ఉన్నారు.

పాపన్నపేట మండలం:
మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలున్నాయి.  వాటిలో 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.   లక్ష్మీనగర్, ముద్దాపురం, రాంతీర్థం, బాచారం, దౌలాపూర్, పాపన్నపేట, పొడ్చన్‌పల్లి, పొడ్చన్‌పల్లి తండా, మల్లంపేట, నర్సింగరావుపల్లి, నామాపూర్, గాజులగూడెం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top